– గుండుగుత్తగా సీట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ !
– పేదల పక్షాన నిలబడే సీపీఐ(ఎం) అభ్యర్థులకే ఓటేయ్యండి : పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్
– హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఈ ఎన్నికల్లో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ.. అవినీతిలో మునిగిపోయిన బీఆర్‌ఎస్.. శాసనసభ సీట్లనే గుండుగుత్తగా అమ్ముకుంటున్న కాంగ్రెస్.. పోటీలో ఉండగా.. వారంతా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొని మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తున్నాయని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ అన్నారు. కాబట్టి పేదల పక్షాన నిలబడే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో సిరికొండ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన హుజూర్‌నగర్ సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లులక్ష్మి ప్రచార యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదల కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి పక్షాన నిలబడే సీపీఐ(ఎం) అభ్యర్థులు రాష్ట్రంలో 19 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారు.. కానీ మనం చీకటిలో మాట్లాడు తున్నామన్నారు. కేరళలో 24 గంటల నాణ్యమైన లో వోల్టేజీ లేని విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కేరళలో ఎర్రజెండా ప్రభుత్వం పేదరికం లేకుండా చేయడంలో విజయవంతమైందన్నారు. విద్యా వైద్యం రంగాల్లో ఘననీయమైన పురోగతిని సాధించి దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 99 శాతం కుటుంబాలకు భూమి ఉందని, 94 శాతం ప్రజలకు ఇండ్లు ఉన్నాయని, మరో నాలుగు శాతం మంది పేదలకు రాబోయే మూడేండ్లలో ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేస్తోందన్నారు. అలాంటి రాజకీయ ప్రత్యామ్నాయం రావాలంటే ఎర్రజెండా నాయకత్వంలో 19 మంది అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపిస్తే పేదలపక్షాన పోరాడి వాణి వినిపించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రకమిటీ సభ్యులు బి.వెంకట్ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ నియోజవర్గంలో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుండి సైదిరెడ్డి ఇద్దరిలో ఏ ఒక్కరూ మల్లులక్ష్మికి పోటీపడగలరా అని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అరిబండి లక్ష్మీనారాయణ, జూలకంటి రంగారెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరొకటి లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సాగర్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, యాదగిరిరావు, ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.