– శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో అన్నీ అబద్దాలే
– ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్ర
– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ జాతీయ నాయకులు చాడవెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, బాల మల్లేశ్‌తో కలిసి ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య రోజురోజుకు క్లిష్టంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టును సందర్శించిన బీఆర్‌ఎస్ నేతలకు స్పష్టత లేదని విమర్శించారు. వారు ఏం మాట్లాడాలో అర్థంకాక ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని వారు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదికను నెల రోజుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ నివేదికను త్వరితగతిన ఇవ్వాలని కోరాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలని ఉవ్విళ్లూరుతుందనీ, అందులో భాగంగానే ప్రధాని రాష్ట్రానికి వచ్చి హడావుడి చేశారని చెప్పారు. మోడీ కనికరం లేని రాజకీయ నాయకుడని విమర్శించారు. అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్నగా కొనియాడితే.. మోడీ మాత్రం పార్టీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు.
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా? లేదా? అనే విషయాన్ని ఎన్నికల ముందే బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బీఅర్‌ఎస్ -బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని చెప్పారు. బీఅర్‌ఎస్‌లో మొన్నటికి, ఇవాళ్టికీ ఏ మార్పు వచ్చిందో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలంటూ చురకలంటించారు. రాష్ట్రంలో ఐదు పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్‌కు ప్రతిపాదన పంపామని చెప్పారు. ఐదింటిలో కనీసం ఒక్కటైనా సీపీఐకి ఇచ్చి, మిత్ర ధర్మాన్ని పాటించాలని అధికార పార్టీని కోరారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడం మంచిదని సూచించారు. చాడా మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ నేతలు కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు. మేడిగడ్డలో ఆరేడు పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు నిజం చెప్పకుండా మసిబూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ అమల్లోకి తెస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకున్న ప్రతి ఒక్కరికీ పట్టాలిచ్చే విధంగా ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.