కుట్రలతో గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ యత్నం

Revanth-Reddy– గువ్వల బాలరాజుపై దాడి అంతా డ్రామా
– ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉంటే ఇలాంటి కుట్రలు సాధారణం
– రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి నాటకాలు
– ప్రభాకర్‌ రెడ్డిపై దాడి చేసిన రాజు రిమాండ్‌ రిపోర్ట్‌ను ఎందుకు బయటపెట్టడం లేదు? : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలతో గెలవాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రేవంత్‌ రెడ్డి ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గువ్వల బాలరాజుపై దాడి విషయంలో తమపై కేటీఆర్‌ ఆరోపణలు తగవన్నారు. గువ్వల బాలరాజే అడ్డువచ్చిన వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఇదంతా ప్రశాంత్‌ కిషోర్‌ స్ట్రాటజీ అని.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి డ్రామాలు సాధారణమని అన్నారు. గువ్వల బాలరాజు కనిపించిన వారిపై దాడులు చేస్తారు. అసెంబ్లీలో కూడా గువ్వల బాలరాజు ప్రవర్తన అందరూ చూశారు. జెడ్పీ సమావేశంలో మక్తల్‌ ఎమ్మెల్యేపై దాడి చేశారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు చెప్తే మా వారిపైనే కేసులు పెట్టారని రేవంత్‌ తెలిపారు. ”గువ్వల బాలరాజుపై దాడి అనేది అంతా డ్రామా. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఘటనలు. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం. ఘటనలే ఇందుకు ఉదాహరణ. కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వలపై దాడి ఘటనలు కుట్రలో భాగమే. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియాకు ఎందుకు చూపలేదు. కొత్త ప్రభాకర్‌రెడ్డి దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలి. ఇప్పటివరకు నిందితుడు రాజు రిమాండ్‌ రిపోర్టు బయటపెట్టలేదు.” అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గాయపడ్డ ప్రభాకర్‌ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్‌ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడారని విమర్శించారు.ఈ దాడి వెనక కాంగ్రెస్‌ ఉందని కేసీఆర్‌ కుటుంబమంతా ప్రచారం చేసింది…కానీ దాడిలో కుట్ర కోణం లేదని పోలీసులే చెప్పారన్నారు. హరీష్‌ రావుకు… దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్‌ సంభాషణ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. హరీష్‌ అనుచరులు, రాజుకు మధ్య ఫోన్‌ సంభాషణ ఏమైనా ఉంటే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.. మరో 15 రోజుల్లో ఇంకో మూడు ఘటనలు జరుగుతాయి అని కేటీఆర్‌ చేసిన ప్రకటనపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి కూలి మనుషులను తెచ్చి కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో నాటకానికి తెర తీశారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను తెలంగాణలో ప్రసారం చేయాలని మంత్రి హరీష్‌ ఛానళ్లకు ఫోన్‌లు చేశారు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? బీజేపీతో పొత్తులో ఉన్న కుమారస్వామి ప్రెస్‌మీట్‌ మంత్రి హరీష్‌ సమన్వయం చేయడం ఏంటి?” అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
మాదిగలను మోసం చేసిన మోడీ
మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి. ఇప్పుడు పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది. అందుకే డిసెంబర్‌ 4 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెడితే కాంగ్రెస్‌ బేషరతుగా మద్దతిస్తుందని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.