– ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు తమ ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మిషన్ భగీరథ అతిపెద్ద కుంభకోణమనీ, కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అనీ, కేవలం కమీషన్ల కోసమే రీడిజైన్ చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌ను ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్‌గా మార్చి నిధులను దారి మళ్ళించిందని ఆరోపించారు. దీనిపై చర్చ రాకుం డా చేసేందుకు దళితబంధును తెరపైకి తెచ్చారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులను నిండా ముంచిందని తెలిపారు. అందుకే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వారు మద్దతు ఇచ్చారని చెప్పారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ బంధుల పేరుతో ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నేతలు హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లెంలా కాచుకుని ఉందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రావన్నారు.
మోడీ పాలనలో దేశ ప్రజలు స్వచ్ఛగా బతికే పరిస్థితి లేదు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి
మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యారు యాత్రపై బీజేపీ అధ్యక్షులు నడ్డా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మోడీని ప్రశ్నించిన ప్రతి పక్షాలను సైతం ఈడీ, సీబీఐ పేరుతో అణిచివేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 60 ఏండ్ల స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే హిందూత్వం ఉందన్నారు. హిందూత్వం పేరుతో బీజేపీ పార్టీ భారతదేశాన్ని విడదీయాలని ప్రయత్నిస్తున్నదన్నారు. ఓట్ల కోసం బీజేపీ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
ప్రజలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు
అధికార ప్రతినిధి శ్రీనివాస్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే లక్షలాది దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చెప్పారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజాపాలనపై బీఆర్‌ఎస్ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారనీ, తమ తీరు మార్చుకోకపోతే బీఆర్‌ఎస్ నేతలను, కార్యకర్తలను చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అభయహస్తం కింద కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయంటేనే బీఆర్‌ఎస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనన్నారు. రేవంత్ పాలనకు వస్తున్న ఆదరణ చూసి బీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని చెప్పారు. .