– ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నాయకులు రోజుకో వేషం వేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. వాళ్లు డ్రంకెన్ డ్రైవ్ పెట్టాలని అంటున్నారనీ, దానితో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా పెట్టాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. అభివృద్ధిపై సభలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. భూభారతి ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు బయటపడతాయన్నారు.
బీఏసీలో చర్చ లేకుండా సభ : కేపీ వివేకానంద
బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ సమావేశాల నిర్వహించటం చరిత్రలో మొదటిసారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ఏ అంశంపై ఎప్పుడు చర్చించాలో స్పష్టత లేదన్నారు. నిబంధనలను బుల్డోజ్ చేసుకుంటూ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. రైతులు, ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు, మహిళలు సమస్యల్లో ఉంటే వాటిపై చర్చ పెట్టకుండా శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పేరుకే ప్రజా పాలన కానీ.. అన్ని అరాచకాలేనని విమర్శించారు.
అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరం :ఎమ్మెల్యే మాణిక్‌రావు
అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయనీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, వారి దయా దాక్షిణ్యాల వల్లనే ప్రజాస్వామ్యం నడుస్తున్నదని చెప్పారు. అంబేద్కర్ చరిత్ర అమిత్‌షాకు తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ మనువాద పార్టీ అనీ, అంబేద్కర్‌ను రెండు సార్లు జన సంఫ్‌ు ఓడించిందని గుర్తు చేశారు.
గల్లీగల్లీకి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతాం :ఎమ్మెల్యే అనిల్ జాదవ్
అంబేద్కర్ విగ్రహాన్ని గల్లీగల్లీకి నెలకొల్పుతామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం అవసరమా అని అమిత్ షా అనటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మనువాద భావజాలంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తాను ఎమ్మెల్యేను అయ్యాన న్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నదని విమర్శించారు.
అమిత్‌షా మాటలు వక్రీకరిస్తున్నారు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
అమిత్‌షా మాటలను కావాలనే కాంగ్రెస్ వారు వక్రీకరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితోనే మోడీ ముందుకు పోతున్నారన్నారు. ఏదో విధంగా అమిత్‌షా మాటలను రచ్చ చేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని విమర్శించారు. ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారన్నారు. అంబేద్కర్‌ని దేవునితో సమానంగా బీజేపీ చూస్తుందని చెప్పారు.
అమిత్‌షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
అమిత్ షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ బి మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ అమిత్‌షా హోం మంత్రిగా బాధ్యతల్లో ఉండి, పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు క్షమించరాని వన్నారు. మొత్తం భారత జాతినే ఆయన అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజలను బాధించిందన్నారు. అమిత్‌షాను హోం మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన మాటలు మనువాద సంస్కతిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయన్నారు. దేశం బహుళ కులాలు, మతాల కలయికతో ఉన్నదన్నారు. ఆయన మాటలు దేశ సమగ్రతకు విఘాతమని విమర్శించారు.
అమిత్‌షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
అమిత్‌షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్‌ని అమిత్ షా అవమానపరిస్తే బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడుతలేరని ప్రశ్నించారు. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షాపై కేసులు పెడుతాయని చెప్పారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటంపై బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్‌టీఆర్ ఘాట్ జోలికొస్తే ఊరుకోం : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి
ఎన్‌టీఆర్ ఘాట్‌పై చేయేస్తే ఊరుకోబోమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. ఎన్టీ రామారావు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులను పర్యాటక కేంద్రంగా చేశారని గుర్తు చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ ఎన్‌టీఆర్ ఘాట్‌ను తొలగిస్తామంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. అదొక గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉందన్నారు. ఎన్‌టీఆర్ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌టీఆర్, కేసీఆర్ మార్క్ లేకుండా కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి : టీజీఎస్
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా నేటి నుంచి 24వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదనీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతంలో భాగమేనని తెలిపారు. అమిత్‌షా వ్యాఖ్యలను మోడీ ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు.