పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆందోళన చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి పై రౌడీషీటర్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పుట్టినరోజును పురస్కరించుకొని మండలంలోని బస్వాపూర్ గ్రామం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీని చించి వేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిసి ఫుటేజీల ఆధారంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జీవన్ పాటు పలువురు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలపై చెయ్యి వేసుకున్నారు. విషయాన్ని స్థానిక బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఆయన జిల్లా ఎస్పీ సింధు శర్మకు ఫోన్ చేసి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సూచించారు. దాడి చేసినా భీమ్ రెడ్డితో పాటు జీవన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ జిల్లా ఎస్పీ సింధు శర్మకు పూర్తి వివరాలు తెలియచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఫ్లెక్సీ చించి వేసిన ప్రవీణ్ కుమార్, సాయిలు, భార్గవ్, ప్రమోదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన ఇద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు. అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి పై రౌడీషీటర్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాము పది సంవత్సరాలు అధికారంలో ఉన్న అన్ని పార్టీలతో కలిసిమెలిసి ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అందరితో కలిసి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.