‘ప్రజల నిర్ణయం మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలి’

నవతెలంగాణ-ఆమనగల్‌
ఆమనగల్‌ పట్టణంలో గురువారం ఎంపీపీ అనిత విజరు అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆమనగల్‌ మండలంతో పాటు మున్సిపాలిటీలో ప్రజల విశ్వాసాన్ని, ఆదరణను ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కోల్పోయారని అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నాలుగున్నర సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఆమనగల్‌ మండలానికి, మున్సిపాలిటీకి పూర్తిగా వ్యతిరేకమయ్యారని అన్నారు. మండలంలో పార్టీకి ఆదరణ ఉన్న, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మీద ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని, ప్రజల అభీష్టం మేరకు గెలుపు అభ్యర్థికి సర్వేపోల్‌ ఆధారంగా టికెట్‌ కేటాయించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు అభివద్ధి పథంలో ఉంటే, కల్వకుర్తి నియోజకవర్గ మాత్రం వెనుకబడి ఉందని అన్నారు. మేము పార్టీకి విధేయులమే కానీ జైపాల్‌ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మెన్‌ అవ్వారి శివలింగం, తెలంగాణ చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్‌, తాళ్ల రవీందర్‌, తెలంగాణ ఉద్యమకారుడు పూసల పరమేష్‌, చుక్క వెంకటయ్య, కష్ణారెడ్డి, శేఖర్‌, నరేష్‌, మెకానిక్‌ బాబా, ప్రభాకర్‌, విజరు రాథోడ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.