– ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్
– డ్రైవర్లకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన
– ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం
నవతెలంగాణ- హిమాయత్‌నగర్
రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న 6 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అసెంబ్లీ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం హైదర్‌గూడ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్‌పార్క్ వరకు ఆటోలలో ప్రయాణించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్, మల్లారెడ్డి, కె.పి.వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆ పథకం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నెలకు ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులను వెంటనే ఆదుకుని, వారి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.