సీఎంను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

సీఎంను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు– పార్టీ మారుతున్నారంటూ వదంతులు
– అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించేందుకే: ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి నేతృత్వంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పఠాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసారు. ఈ భేటీపై సోషల్‌ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేవలం మర్యాద పూర్వకంగానే కలిసామని వారు వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల, ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు, గన్‌మెన్ల సంఖ్య కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకే రేవంత్‌ను కలిసినట్టు ప్రకటించారు. పార్టీ మారేందుకే సీఎంను కలిశారని వస్తున్న వదంతులను సదరు శాసన సభ్యులు కొట్టి పారేశారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే సీఎంను కలిసామనీ, అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని మహిపాల్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఇంతకు మించి ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదనీ, వదంతులను నమ్మొద్దని వారు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం ఎలా కలిశారో తాము అలానే కలిశామని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ లోకసభ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామని తెలిపారు.