కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేష్‌ నేత

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేష్‌ నేత– ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే,సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక
– హస్తం గూటికి టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ అనుసరిస్తున్న వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వెంకటేష్‌ నేత ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌, సీఎం ఏ. రేవంత్‌ రెడ్డి సమక్షంలో వెంకటేష్‌ నేత, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కేసీ వేణుగోపాల్‌ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. మన్నె జీవన్‌ రెడ్డితో పాటు మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత రహ్మాన్‌, పలువురు కార్యక్తరలు హస్తం గూటికి చేరారు. చేరికల అనంతరం కేసీ వేణుగోపాల్‌, సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి ఎంపీ వెంకటేష్‌ నేత, మన్నె జీవన్‌ రెడ్డి, ఇతర నేతలు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్‌ నేత, మన్నె జీవన్‌ రెడ్డిలను సీఎం రేవంత్‌ రెడ్డి, పార్టీ చీఫ్‌ ఖర్గేకు పరిచయం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి, గవినోళ్ల మధుసూదన్‌ రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండు ఎంపీ స్థానాల గెలుపునకు కృషి : మన్నె జీవన్‌ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ నేత మన్నె జీవన్‌ రెడ్డి అన్నారు. పార్టీ తనపై విశ్వాసంతో ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్‌ గెలిచేలా కృషి చేస్తానని తెలిపారు. తన బాబాయి, బీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డితో చర్చించాకే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 17 స్థానాలకు 17 కాంగ్రెస్‌ గెలిచే అవకాశముం దని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎంపీ వెంకటేశ్‌ నేత బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ లేఖను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు.