– బడ్జెట్ ప్రసంగం కాదు…సొంత డబ్బా కొట్టుకున్నారని విమర్శ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర బడ్జెట్‌లో మరోసారి తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ మొండి చేయి చూపిందని బీఆర్‌ఎస్ ఎంపీలు విమర్శించారు. విభజన హామీల అమలు, హక్కుగా రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించకపోవడంపై దారుణమన్నారు. మొత్తంగా ఎన్నికల వేళ ప్రచారం చేసుకునేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారు తప్ప, దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్ పై బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా బడ్జెట్ ప్రసంగం సొంత డబ్బా లాగా ఉందన్నారు. రాజకీయ ప్రసంగంలా సాగిందే తప్ప, ఏ వర్గాన్నీ సంతృప్తిపరిచేలా లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశ, నిస్పృహతో కూడుకుందన్నారు. 2022-23 నాటికి రైతుల ఆదాయం డబుల్ చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో రూ. 15 లక్షలు వేస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి తక్కువ కేటాయింపులు అంటే రైతులకు మొండి చేయి చూపడమే అని ఫైర్ అయ్యారు. రైతు ఖర్చులు, పెట్టుబడి పెరిగాయనీ, దీంతో పీఎం కిసాన్ సాయం పెంచుతారని రైతులు ఆశించారని, కానీ కేంద్రం ఈ విషయంలో ఆలోచించలేదన్నారు.