శ్రీశైలం, సాగర్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగింతపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం

– రాష్ట్రానికి పూడ్చలేని నష్టం జరుగుతందని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్ట్‌ల అప్పగింతపై అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేఆర్‌ఎంబీ తీసుకునే నిర్ణయాలతో రాష్ట్రానికి పూడ్చలేని నష్టం జరుగుతుందని, అందువల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రిని కోరారు. కృష్ణా ట్రిబ్యూనల్‌ విచారణ ముగిసే వరకు… ఏపీ, తెలంగాణలకు 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.