నేడు ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటు స్థాయి సమావేశం

– 50 రోజుల తర్వాత బయటకు రానున్న కేసీఆర్‌
నవ తెలంగాణ- గజ్వేల్‌
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి ఎంపీలతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి, సీనియర్‌ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి హాజరుకానున్నట్టు సమాచారం. వారం రోజుల కిందటే కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం. తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థుల విషయంపై చర్చించి కొలిక్కి తెచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ సన్నిహితుల ద్వారా తెలిసింది. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం వంటేరు ప్రతాప్‌ రెడ్డికి ఖాయమైనట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్య నేతలను, మెదక్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచే అవకాశం ఉంది. మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి కూడా సమావేశానికి వెళ్లే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సుమారు 50 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెేసీఆర్‌ ఆ తర్వాత రాజకీయ సమావేశాల్లో పాల్గొనలేదు.