మూడు నెలల తర్వాత బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌

మూడు నెలల తర్వాత బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌– అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్‌ కుటుంబం
– తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆరే : స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకులు కడియం శ్రీహరి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
మూడు నెలల తర్వాత బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవుతుందని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకులు కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్నతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. భారత రాజ్యాంగం మనందరికీ భావప్రకటన స్వేచ్చను ఇచ్చిందని బీఆర్‌ఎస్‌, బీజేపీకు ఓటు వేస్తే అలాంటి స్వేచ్చ మనకు దొరకదన్నారు. ఈ పదేండ్ల కాలంలో రాజ్యంగ, పాలన వ్యవస్థను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. మోడీ నిరంకుశ పాలనను సాగానంపాలంటే అది కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యమన్నారు. కేసీఆర్‌ రోడ్‌ షోలో తనను టార్గెట్‌ చేసి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. తెలంగాణా ప్రజలను మోసం చేసింది తాను కాదని, కేసీఆరేనని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో వారి కుటుంబం చేసిన అవినీతి కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయన్నారు. సీఎం హోదాలో కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాను ఆరు ముక్కలు చేసి నాశనం చేసిండని దుయ్యబట్టారు. ఇంతవరకు వరంగల్‌కు మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయలేదని, అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ లేదని తెలిపారు.
పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర కీలకమని చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి రాగానే వారిని ఎన్నో అవమానాలకు గురి చేసి పార్టీ నుంచి మెడలు పట్టి గెంటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కనుమరుగు అవుతుందని, ఉద్యమ పార్టీగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఆ పార్టీ భూస్థాపితమవుతందని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌ను తలదన్నేలా వరంగల్‌ను మారుస్తానన్న కేసీఆర్‌.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డాక్టర్‌ కడియం కావ్యకు ఓటేస్తే.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా తీన్మార్‌ మల్లను భారీ మెజారిటీతో గెలుపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ కార్పొరేటర్‌ బోడ డిన్న అతని అనుచరులు సుమారు 500 మంది నాయిని రాజేందర్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ మొహమ్మద్‌ అజీజ్‌ ఖాన్‌, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.