– మధిర సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌కు సంపూర్ణ మద్దతు తెలంగాణ ఉస్మానియా విద్యార్థి జేఏసీ
నవతెలంగాణ- ఎర్రుపాలెం
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రామ్‌శెట్టి పుల్లయ్య భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలడుగు భాస్కర్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పలు సంఘాలు నిర్వహించిన ఉద్యమాల్లో పాల్గొన్న భాస్కర్‌కు.. తాము సైతం చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. అసెంబ్లీలో అణగారిన ప్రజల గొంతుకగా ప్రజావాణిని వినిపించాలనే ఆలోచనతో పాలడుగు గెలుపును కాంక్షిస్తూ మధిర నియోజకవర్గంలోని 5 మండలాల్లోని గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. చైతన్యం కలిగిన మధిర ఓటర్లు సామాజిక ఉద్యమంలో నిరంతరం పాల్కొంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న పాలడుగు భాస్కర్‌కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జీవన్, ఉస్మానియా విద్యార్థి జేఏసీ విద్యార్థులు యాదగిరి, ఉపేందర్ నాయక్, వంగూరి రాములు, జిల్లా రైతు సంఘం నాయకులు దివ్వెల వీరయ్య, సీఐటీయూ మండల నాయకులు సగ్గుర్తి సంజీవరావు, వృత్తి సంఘం నాయకులు నాగులవంచ వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్‌ఎస్‌ను ఓడించాలి
2:16 am