– కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు మావే : నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుద్యోగ యువత బీఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో అతిపెద్ద సామాజికమైన తరగతి అయిన ముదిరాజ్ కులానికి బీఆర్‌ఎస్ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ముదిరాజ్ కులస్తులు బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టాలని చెప్పారు. 12శాతం ఉన్న ముస్లిములకు మూడు టికెట్లు కేటాయించి.. ఆ తరగతి వారిని అవమానించారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 స్థానాలు తామే గెలుస్తామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలవడం ఖాయమని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆగడాలకు అడ్డూఅదుపూ లేదన్నారు. మైనింగ్, వైన్స్, సాండ్, ల్యాండ్ లాంటి అనేక దందాలు చేస్తున్నారని ఆరోపించారు. గుదిబండ గ్రామంలో దళితబంధు పథకంలో 70 శాతం అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. వెంచర్ చేయాలంటే ఎకరానికి రూ.3 లక్షలు ఎమ్మెల్యేకు ఇవ్వాలని కండిషన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్‌కు ట్యాక్స్ (బీఎంటీ) కట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలందరి కోరిక మేరకు హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి తాను, కోదాడ నియోజకవర్గం నుంచి పద్మావతిరెడ్డి పోటీ చేస్తామని చెప్పారు. తమపై హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.