త్వరలో బీఆర్‌ఎస్‌ చీలిక

BRS split soon–  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఉందా? : బండిసంజరుకి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ త్వరలోనే రెండుగా చీలిపోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఒక పార్టీకి సంబంధించిన సమాచారం మరో పార్టీకి తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను పొన్నం తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ముందా? అని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదు కానీ బండి సంజయ్ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు’ అని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్‌, బోయినపల్లి వినోద్‌కుమార్‌, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘బండి సంజయ్ ఏమైనా జ్యోతిష్యం చదివారా? మా పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మీకెందుకు?. ఇక్కడ కాంగ్రెస్‌ ఉంది. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ రావాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
కుట్రలు చేస్తే నామరూపాలు లేకుండా చేస్తారు : అద్దంకి దయాకర్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ఏ పార్టీ అయినా ప్రజలే నామరూపాలు లేకుండా చేస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ హెచ్చరించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, టీఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న మైత్రిని మరొకసారి బయటపెట్టాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు చేస్తున్న అనైతిక రాజకీయంపై తమ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. ఆ పార్టీలకు మించి తమ పార్టీ రాజకీయం చేయగలదని గుర్తు చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమనీ, ప్రజలే అన్ని విధాలుగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా, హాని చేయాలని తలపించిన ప్రజలే సమాధానం చెప్తారని హెచ్చరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి ఖండించారు.