బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక

నవతెలంగాణ – రాయపోల్ 
దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ, డిసిసి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మోహన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మామిడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి ప్రజల మెప్పు పొందిందని అతి తక్కువ కాలంలోనే జనారంజక పథకాలు అమలు చేస్తున్న తీరుకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియాగాంధీ రుణం తీర్చుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేస్తూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అదే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్  పార్లమెంటు అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, డిసిసి మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, చాగండ్ల నరేంద్రనాథ్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, నర్సాపూర్  నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, పటాన్ చెరు కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.