మార్పును జీర్ణించుకోలేకపోతున్న బీఆర్‌ఎస్‌

BRS unable to digest change– ప్రభుత్వంపై అసహనం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
– కొత్త సర్కారుకు కొంత సమయమిస్తాం
– ఐదు ఎంపీ స్థానాలపై కేంద్రీకరించాం : కూనంనేని
– ఇండియా కూటమిని బలోపేతం చేస్తాం : నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజాస్వామ్యంలో జరిగిన మార్పును, రాష్ట్రంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారడాన్ని బీఆర్‌ఎస్‌ భరించలేక పోతున్నదనీ, జీర్ణించుకోలే కపోతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకుండానే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని తాము నిర్ణయిం చామన్నారు. రెండు రోజులపాటు జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం, కార్యవర్గం, రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా గురు వారంహైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్‌, పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలపై కేంద్రీకరించామని చెప్పారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌, సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమకు ఒక సీటు కావాలని కాంగ్రెస్‌ను అడుగుతామన్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు కమిటీలను నియమించి మరింత క్రియాశీలకంగా వ్యవహారించాలని నిర్ణయించామని అన్నారు. కొంత సమయం తర్వాతే ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజల కోరికలు ప్రతిబింబించేలా వ్యవహరిస్తామన్నారు. జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామంటూ బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పిందనీ, అవన్నీ కాగితాలకే పరిమితమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి ఉందన్నారు.
ఈవీఎంలపైనే బీజేపీ ఆశలు : అజీజ్‌ పాషా
గత ప్రభుత్వంలో కేవలం ఒక కుటుంబమే రాష్ట్రాన్ని పాలించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొంత విశాల దృక్ఫథంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నదని అన్నారు. పార్లమెంట్‌ నుంచి ప్రతిపక్షాలను బయటకు పంపి బీజేపీ ప్రభుత్వం మూడు క్రిమినల్‌ బిల్లులను ఆమోదించడం అన్యాయమని చెప్పారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లో గెలిచాక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలుస్తామన్న ధీమాతో బీజేపీ ఉందన్నారు. ఈవీఎంలపైనే ఆశలు పెట్టుకుందని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
పొగబాంబు బీజేపీ ముందస్తు ప్రణాళిక : నారాయణ
దేశంలో ‘ఇండియా కూటమి’ బలపడుతున్న నేపథ్యంలోనే బీజేపీ ముందస్తు ప్రణాళికలు వేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. పార్లమెంటులో పొగబాంబు ఘటన అందులో భాగమేనని విమర్శించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని అడ్డంపెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు పొందాలని బీజేపీ చూస్తున్నదని అన్నారు. ఏ సమయంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే దానిపై బీజేపీ ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించిందని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమిని బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా తాము పది నుంచి 12 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఎపీ సీఎం జగన్‌ పరామర్శించడం రాజకీయంలో భాగమేనని అన్నారు. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే జగన్‌ భయపడ్డారని చెప్పారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.