శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరైబాద్‌
చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు (సవరణ) బిల్లు, 2024కు వ్యతిరేకంగా శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేసింది. గురువారం ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌ బాబు ప్రవేశపెట్టగా, బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించి వాకౌట్‌ చేశారు. అనంతరం బిల్లు ఉద్దేశాలను మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. అనంతరం బిల్లు సభ ఆమోదం పొందినట్టు శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు.
ఆకుపచ్చ కండువాలతో బీఆర్‌ఎస్‌ సభ్యులు
గురువారం శాసనమండలి సమావేశానికి బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆకుపచ్చ కండువాలతో హాజరయ్యారు. దీనిపై ఆ పార్టీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్‌ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.
రూ.2 లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ చేయాలనీ, అన్ని పంటలకు వెంటనే బోనస్‌ చెల్లించాలని కోరారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆకుపచ్చ కండువాలతో వచ్చినట్టు తెలిపారు. అంతకుముందు రైతు సమస్యలపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తిరస్కరించారు.