సికింద్రాబాద్‌లో.. బీఆర్‌ఎస్‌దే గెలుపు

సికింద్రాబాద్‌లో.. బీఆర్‌ఎస్‌దే గెలుపు– అంబర్‌పేట పాదయాత్రలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– కిషన్‌ రెడ్డి ఓటమి ఖాయం
– హైదరాబాద్‌ ప్రజలు మరోసారి మద్దతివ్వాలని విజ్ఞప్తి
-24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఎంపీగా.. పదేండ్లలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ నగరానికి, తెలంగాణకు ప్రత్యేకంగా అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏమీ తెలేదని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అంబర్‌పేట నియోజకవర్గంలో కేటీఆర్‌ పాదయాత్ర నిర్వహించారు. పటేల్‌ నగర్‌ ప్రాంతంలోని ప్రేమ్‌ నగర్‌ చౌరస్తా నుంచి ఆజాద్‌ నగర్‌, పటేల్‌ వాడల్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. గెలిచిన తర్వాత అటు అంబర్‌పేట నియోజకవర్గానికి గాని, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. కిషన్‌ రెడ్డికి దమ్ముంటే గత ఐదేండ్లలో తీసుకొచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్‌ విసిరారు. గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్‌ రెడ్డి, ఈసారి మాత్రం కచ్చితంగా ఓడిపోతారని అన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరానికి చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని, తమ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కి మద్దతు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత అధికారం కోసం ఢిల్లీకి పర్యటనలు చేసే నాయకులను కాకుండా, నిత్యం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్‌ లాంటి ప్రజా నాయకులు నియోజకవర్గానికి అవసరమని అన్నారు. బీఆర్‌ఎస్‌ కంచుకోటగా మారిన రాజధానిలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్‌ తెలిపారు. కాగా, పాదయాత్రలో భాగంగా పలువురు ఇండ్లకు వెళ్లడంతోపాటు, మార్గమధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కేటీఆర్‌ పలకరించుకుంటూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌, స్థానిక కార్పొరేటర్లు విజరు కుమార్‌ గౌడ్‌, యువజన నాయకులు రామేశ్వర్‌ గౌడ్‌, ముఠా జై సింహ, డివిజన్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ ముదిరాజ్‌, సీనియర్‌ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావు, మహేష్‌ ముదిరాజ్‌ భవాని ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.