ట్రోల్‌ చేసేది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే

– సురేఖ అక్కకు జరిగిన అవమానానికి
– తమ్ముడిగా బాధపడుతున్నా… : ఎంపీ రఘునందన్‌రావు ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, తనపై తప్పుడు పోస్టులతో ట్రోల్‌ చేస్తున్నది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. సురేఖ అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తాను బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధంపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టింది. ఒక తమ్ముడిగా మంత్రి సురేఖను అడిగి మరీ నూలు పోగు దండ వేశాను. అలాంటి దండను ప్రధాని మోడీకి వేశాను. దీనిపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేసింది. దీనిపై పోస్టులు పెట్టిన వారిని ఒక లాయర్‌గా కోర్టుకు ఈడుస్తా. పోస్టులు పెట్టిన అకౌంట్‌ డీపీలో హరీశ్‌రావు, కేసీఆర్‌ ఫోటో ఉన్నది. ఆ పార్టీ నేతలకు సోషల్‌ మీడియా మీద నియంత్రణ లేదా? తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు మీ వాళ్లు అయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులైయితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ట్రోలింగ్‌ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులను కంట్రోల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు దీనిపై స్పందించి సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన వల్ల అక్క సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.