బీఆర్‌ఎస్‌ × బీసీ

BRS × BC– అక్కడ సరే.. ఇక్కడి మాటేమిటి…?
– శాసనసభ, మండలి, మంత్రివర్గంలో మా స్థానాలెన్ని..?
– తొలి జాబితాలో మాకు దక్కిన స్థానాలెన్ని?
– అధికార పార్టీపై బీసీ నేతల గుస్సా
– మిగిలిన స్థానాల్లోనైనా పరిశీలించాలంటూ డిమాండ్‌
– కారు పార్టీకి కొత్త చిక్కులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికార బీఆర్‌ఎస్‌పై రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. అదే పార్టీకి చెందిన బడుగు, బలహీన వర్గాల (బీసీ) నాయకులు, అత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ)కు చెందిన లీడర్లు సైతం సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలిపై గుస్సా అవుతున్నారు. ఎన్నికల వేళ ఈ వ్యవహారం గులాబీ పార్టీకి లేనిపోని తలనొప్పులు తెచ్చేదిగా ఉంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇటీవల మహిళా బిల్లును ముందుకు తెచ్చిన సంగతి విదితమే. ఆ బిల్లుకు మద్దతునిచ్చిన బీఆర్‌ఎస్‌… మరో ప్రధాన డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంతోపాటు కులగణన చేపట్టాలంటూ ఆ పార్టీ కోరుతోంది. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించ లేదనే అంశాన్ని అది ప్రస్తావిస్తోంది. ఇదే అంశంపై ఇప్పుడు రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ నేతలు బీఆర్‌ఎస్‌ను నిలదీస్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్‌ సకల జనుల సర్వే అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి, ఒక్కరోజుల్లో ఆ సర్వేను పూర్తి చేయించారు. కానీ అందులో వచ్చిన వివరాలను మాత్రం ఇప్పటి వరకూ వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి సమస్యగా తయారవుతోంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలున్నాయి. వీటిలో బీసీలు, ఎంబీసీలకు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ప్రాధాన్యత నామమాత్రమేనని ఆయా తరగతుల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి 19 మందే బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నెల క్రితం విడుదల చేసిన గులాబీ పార్టీ తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌, అందులో బీసీలకు కేవలం 23 స్థానాలనే కేటాయించారు. ఇదే సమయంలో ఓసీ సామాజిక తరగులకు మొత్తంగా 63 సీట్లను కేటాయించటం గమనార్హం. ఈ 115 పోను మిగిలిన నాలుగు స్థానాల్లో కూడా (జనగామ పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సాపూర్‌ సునీతా లక్ష్మారెడ్డితోపాటు మల్కాజ్‌గిరి నుంచి కూడా ఓసీనే బరిలోకి దించే అవకాశం) ఓసీలకే ప్రాధాన్యతనివ్వటంపై బీసీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యుల్లో అన్ని పార్టీల నుంచి కలిపి కేవలం ఆరుగురు బీసీలకే స్థానం దక్కిందని వారు వాపోతున్నారు. మరోవైపు బీసీల్లో బలమైన సామాజిక తరగతిగా ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించకపోవటంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వీరితోపాటు ఎంబీసీలైన కుమ్మరి, రజక, పెరిక తదితరులకు కూడా చోటు దక్కకపోవటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మహిళా బిల్లు, ఓబీసీ బిల్లుపై మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వైఖరిని తాము స్వాగతిస్తున్నామని పఠాన్‌చెరు నుంచి పోటీ చేయాలనుకుంటున్న నీలం మధు ముదిరాజ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోనూ గణనీయ సంఖ్యలో ఉండి, గెలుపోటములను నిర్ణయించే శక్తిగల ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. తక్షణమే తమ సామాజిక వర్గానికి ఐదు అసెంబ్లీ స్థానాలను కేటాయించాలనీ, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.