బీఆర్‌ఎస్‌ది ఎప్పుడూ ప్రజాపక్షమే

బీఆర్‌ఎస్‌ది ఎప్పుడూ ప్రజాపక్షమే– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ విలేకరి- జనగామ
అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా.. బీఆర్‌ఎస్‌ది ఎప్పుడూ ప్రజాపక్షమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో బుధవారం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని తెలిపారు. ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తుంటారని అన్నారు. జనగామలో గులాబీజెండా ఎగురవేసిన సైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్‌ఎస్‌కు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 60 రోజులు పూర్తయ్యిందని హరీశ్‌రావు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.4వేల పింఛన్‌ ఇస్తామని ఊదరగొటా ్టరని.. కానీ ఉన్న రెండు వేల పెన్షన్‌ను కూడా కట్‌ చేశారని విమర్శించారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రూ.15వేలు ఇస్తామన్నారని తెలిపారు. కానీ ఉన్న రూ.10 వేలు పోయింది.. వేస్తామన్న రూ.15వేలకు కూడా దిక్కులేదని అన్నారు. హామీల అమలులో సీఎం రేవంత్‌ రెడ్డి ఎగవేత, దాతవేట వైఖరిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్‌ రాకముందే హామీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మీ ఇవ్వకుండా ఆడబిడ్డలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పి.రాజేశ్వర్‌రెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.
కరెంట్‌ కట్‌పై ..
ఆయన కరెంట్‌ పరిస్థితిని వివరిస్తున్న సమయంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మార్పు వచ్చిందంటూ హరీశ్‌రావు సెటైర్‌ వేశారు. జనరేటర్‌ ఆన్‌ చేయడంతో హరీశ్‌రావు మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు.