సీతక్కకు బీఆర్‌టీయూ నేతల కృతజ్ఞతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రిటైర్డ్‌ అవుతున్న అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు లక్ష రూపాయల బెనిఫిట్స్‌ ప్రకటించినందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(బీఆర్‌టీయూ అనుబంధం) నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే జీవో విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆమెను కలిశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతున్న వారికి కూడా బెనిఫిట్స్‌ వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలని వినతి పత్రం సమర్పించారు. అర్హులైన ఆయాలకు ప్రమోషన్‌ ఇవ్వాలని, స్థానికత లేని అంగన్వాడీ టీచర్లకు బదిలీలు చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్ల భారతి, వి.నిర్మల, కోశాధికారి ఎం.వేదవతి, బి.శిరీష, అనిత ఉన్నారు.