ఇద్దరు యువకుల దారుణ హత్య

– రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఘటన
నవతెలంగాణ-ఆమనగల్‌
ఇద్దరు యువకులు దారుణహత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్‌ బటర్‌ ఫ్లై సిటీలో జరిగింది. కడ్తాల్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌ మండలంలోని గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన జలకం రవి కడ్తాల్‌ సమీపంలో ఫార్చ్యూన్‌ బటర్‌ ఫ్లై సిటీలోని 3/4/5 విల్లాలను బుధవారం రాత్రి అద్దెకు తీసుకున్నాడు. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజుగౌడ్‌, మరికొంత మందిని అక్కడికి పిలిపించుకున్నాడు. వీరితో పాటు గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషుగారి శివ (27), గుండెమోని శివ (25)నూ అక్కడికి పిలిపించాడు. కాగా, రాత్రి అక్కడే వీరి మధ్య గొడవ జరగడంతో శేషుగారి శివ, గుండెమోని శివను నిందితులు అతి కిరాతకంగా చంపి అక్కడి నుంచి పారిపోయారు. గురువారం ఉదయం మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్‌ అడిషనల్‌ డీసీపీ రామ్‌కుమార్‌, షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి, కడ్తాల్‌ ఆమనగల్‌ సీఐలు శివప్రసాద్‌, ప్రమోద్‌కుమార్‌, ఎస్‌ఐలు వరప్రసాద్‌, బాల్‌ రామ్‌.. ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాల ఆందోళన
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళన విరమించారు. హత్యకు గురైన శేషుగారి శివ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. గుండెమోని శివ చికెన్‌ షాప్‌లో పనిచేస్తుండే వాడని స్థానికులు తెలిపారు.