బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు

బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు– ప్రయివేటు టెల్కోలకు టారీఫ్‌ సెగ
– కొత్తగా 27.5 లక్షల ఖాతాదారుల జోడింపు
న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కోలు భారీగా టారీఫ్‌లను పెంచడంతో లక్షలాది మంది ఖాతాదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకుం టున్నారు. జులై తొలి వారంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు తమ ఖాతాదారులపై ఏకంగా 25 శాతం మేర చార్జీలను పెంచాయి. దీంతో వినియోగదారులపై భారం పెరిగడంతో చౌక ధరల్లో మెరుగైన ప్లాన్లను అందిస్తున్న ప్రభుత్వ టెల్కో బీఎస్‌ఎన్‌ఎల్‌కు మొబైల్‌ నెంబర్‌ పోర్టిబిలిటీ (ఎంఎన్‌పీ) పెట్టుకుంటున్నారు. ధరల భారాన్ని తగ్గించుకోవడానికి 27.5 లక్షల మంది ఖాతాదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు.”ప్రభుత్వ టెల్కో బీఎస్‌ఎన్‌ఎల్‌ చందాదారుల సంఖ్య పెరుగుతోంది. 4జీ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తున్నాం. 5జీ సేవలకు మారడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం మీద 2025 నాటికి 4జీ నెట్‌వర్క్‌కు చెందిన లక్ష టవర్లు ఇన్‌స్టాల్‌ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.” అని ఐటీ, టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఓ ఇంటర్యూలో తెలిపారు. 4జీ టవర్ల ఏర్పాటు కోసం తేజస్‌ నెట్‌వర్క్‌, సి డాట్‌, టీసీఎస్‌ తదితర సంస్థలతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదర్చుకుని పని చేస్తోంది. 2024 అక్టో బర్‌ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్‌స్టాల్‌ చేయాలని నిర్దేశించుకుంది. ఇతర టెలికం కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పెద్ద సంఖ్యలో వస్తున్నారని మంత్రి సింధియా తెలిపారు.