– బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీని ఓడించాలని పిలుపు
– అమిత్‌షా వ్యాఖ్యలు హాస్యాస్పదం : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహుజన సమాజ్ పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 3 న 20 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీఎస్పీ, సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 43 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. బీసీ కులాలకు చెందిన బండి సంజయ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రధానిగా బీసీ ఉన్నా కులగణన చేపట్టడం లేదని గుర్తు చేశారు. బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్ ధన బలం పనికిరాదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దని కోరారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారన్న ఆయన మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన నాలుగేళ్లలోనే కుంగిపోవడానికి కారకులు ఇంజనీర్లా లేక కేసీఆర్ బినామీ కాంట్రాక్టర్లా? అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ప్రకటించిన మొత్తం 63 అసెంబ్లీ స్థానాలకు బీసీ26, ఎస్సీ 21, ఎస్టీ11, ఓసీ03, మైనార్టీలు02 సీట్లు కేటాయించారు.