కేజీ వీల్స్ తో బీటీ రోడ్డు డ్యామేజ్

నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల మండల కేంద్రం నుండి మర్రిపల్లి గ్రామానికి వెళ్లే మూడు కిలోమీటర్ల రోడ్డు గతంలో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు అంతరాయం ఏర్పడి కనీసం ఆటోలు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది అయితే ఎన్నికల ముందు కొత్త రోడ్డుకు మోక్షం ఏర్పడింది. ఉప్పునుంతల – మర్రిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు మళ్లీ కొత్తగా బీటీ రోడ్డు వేశారని సంతోషాన్ని వ్యక్తపరిచారు. కానీ కేజీ వీల్స్ ట్రాక్టర్ల వల్ల కొత్త రోడ్డు కూడా మళ్లీ తొందరలోనే ధ్వంసమయ్యే అవకాశాన్ని గుర్తు చేస్తున్నాయని కొందరు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీ వీల్స్ బీటీ రోడ్లపై తిరుగోద్దని అధికారులు ఆంక్షలు విధించారు. అయినా అవేమీ పట్టనట్టు బీటీ రోడ్ల పైన కేజీ వీల్స్ తో దర్జాగా తిరుగుతున్నారు. కొందరు దాంతో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. దయచేసి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అలాంటి వారిని గుర్తించి కఠినమైన చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రైతులు కూడా కొత్తగా రోడ్డు మరమ్మతులు చేపట్టినప్పుడు పైప్ లైన్లు రోడ్డుకు అవతల ఇవతల నీళ్లు వాడుకునే రైతులు అప్పుడే పైప్ లైన్లు వేసుకోకుండా రోడ్డు మొత్తం వేసినాక రోడ్డు ధ్వంసం చేసి పైప్ లైన్లు వేసుకుంటున్నారు. దాంతో రోడ్లపైన పెద్ద పెద్ద గోతులు ఏర్పడి వాహనాలకు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది అలా ఉండగా మళ్లీ కేజీ వీల్స్ వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు చర్యలు చేపట్టి రోడ్లపైకి కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు రాకుండా, గ్రామస్తులకు రైతులకు టాం టాం ద్వారా అవగాహన కల్పించి బీటీ రోడ్డు కోతకు గురికాకుండా చూడాలని వేడుకుంటున్నారు.