బువ్వ భారం

బువ్వ భారంసామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో 8.70 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పెరుగుదల నమోదైంది. గడిచిన నాలుగు నెలల కాలంలో ఈ స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌ నెలలో దేశమంతా నెలకొన్న విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల ప్రభావం దీనికి అదనంగా చేరనుంది. మే నెలలో కూడా ఇప్పటివరకు దాదాపుగా అదేరకమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతుండటంతో గోధుమలతో పాటు, కూరగాయలు, పండ్లు, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా తీవ్రమవుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగి సామాన్యులకు పెనుభారంగా మారతాయన్న అంచనాలు కలవరానికి గురిచేస్తున్నాయి.
నిజానికి నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండి ఆహారవస్తువుల ధరలు పైపైకే చూస్తున్నాయి. 2023వ సంవత్సరం నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం మొదటిసారి 8శాతం దాటింది. అప్పటి నుండి ఇంకా పైపైకే దూసుకుపోతోంది గానీ, కిందకి దిగే సూచనలే కనిపించడం లేదు. బీజేపీ సర్కార్‌ అనుసరించిన కార్పొరేట్‌ అనుకూల, పేదల వ్యతిరేక ఆర్థిక విధానాలే దీనికి కారణం. తాజా గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రజలపై భారం మరింత ఎక్కువగా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదవుతోంది. ఏప్రిల్‌ నెల గణాంకాల్లో ఇది 5.43 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 4.11 శాతంగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆహారధాన్యాల ధరలు 8.75 శాతం పెరగగా, పట్టణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 8.56 శాతంగా ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా కొన్నేండ్లుగా గ్రామీణ ప్రాంతాలపై పెరుగుతున్న ఒత్తిడికి ఈ పరిస్థితే నిదర్శనం.
వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుని సతమతమవు తుండగా, కనీస మద్దతు ధరల కోసం రైతాంగం ఏండ్ల తరబడి పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉపాధి హామీ చట్టం ఊపిరి తీసేలా ఏడాదికేడాది కేంద్ర ప్రభుత్వం నిధులను దిగ్గోస్తోంది. ఫలితంగా గ్రామీణ భారతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉసూరు మంటోంది! మార్చి నెలతో పోలిస్తే తృణధాన్యాల ధరలు 8.63శాతం, పండ్లు 5.22, నూనెలు 9.43, మాంసం-చేపల ధరలు 8.17శాతం మేర పెరిగాయి. కూరగాయలు, వంటనూనెల ధరలు వరుసగా రెండు నెలల్లోనూ (మార్చి, ఏప్రిల్‌)27.8, 16.8 శాతం మేర పెరగడం సామాన్యుడి జేబుకి పడినచిల్లుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కన్య్జూమర్‌ అఫైర్స్‌ , ధరల పర్యవేక్షణ విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో బియ్యం ధరలు సగటున 14.3శాతం పెరిగాయి. గోధుమల ధరలు 6.4శాతం ఎక్కువగా ఉన్నాయి. తృణధాన్యాల ధరలు సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. కూరగాయలు, నూనెల ధరలు రెండంకెల స్థాయిలో పెరుగుదలను కొనసాగిస్తాయి.
మరోవైపు హోల్‌సేల్‌ ధరల సూచి కూడా పైపైకే వెడుతోంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతానికి పెరిగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం 13 నెలల్లో ఇదే అత్యధికం.ఈ నివేదిక ప్రకారం ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు కూడా రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. కీలకమైన ఈ అంశాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి మోడీ ప్రభుత్వం తన పాలనా కాలమంతా ఎన్నో టక్కుటమార విద్యలను ప్రదర్శించింది. ఎన్నికల సమయంలో ఆ జిత్తులు పనిచేయ లేదని, ప్రజలు తమ నిత్యజీవిత అనుభవం నుండే స్పందిస్తున్నారన్న సంకేతాలు దేశ వ్యాప్తంగా వస్తున్నాయి. కార్పొరేట్‌ అనుకూల విధానాల నుండి ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాల వైపు దేశాన్ని మళ్లించడమే ధరాఘాతానికి శాశ్వత పరిష్కారం.