విషమంగానే బుద్ధదేవ్‌ ఆరోగ్యం

– వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ (ఎం) సీనియర్‌ నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య (79) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌ పైనే చికిత్స కొనసాగిస్తున్నారు. బుద్ధదేవ్‌ రొమ్ము భాగానికి సోమవారం ఉదయం సీటీ స్కాన్‌ నిర్వహించామని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. బుద్ధదేవ్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉన్నదని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని సీనియర్‌ వైద్యుడొకరు చెప్పారు. ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునేందుకు బుద్ధదేవ్‌కు మరికొన్ని వైద్య పరీక్షలు కూడా చేశారు. ఆ పరీక్షల నివేదికలు అందిన తర్వాత ఏం చేయాలనే దానిపై వైద్యుల బృందం నిర్ణయం తీసుకుంటుంది. బీపీ, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి సంతృప్తికరంగానే ఉన్నాయని వైద్యులు వివరించారు. అయినప్పటికీ ఆయనకు ప్రమాదం తొలగిపోలేదని చెప్పారు. కరోనా వైరస్‌ బారిన పడడంతో బుద్ధదేవ్‌ ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. వాటి పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నామని, ఏదేమైనా మరో 24 గంటల పాటు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో బుద్ధదేవ్‌ను శనివారం అలీపోర్‌లోని ఉడ్‌లాండ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. శ్వాసకోశం కింది భాగానికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, ‘టైప్‌ 2’ శ్వాసకోశం వైఫల్యంతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. వయసు మీదపడడంతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా ఆయనను బాధిస్తున్నాయని చెప్పారు.
బుద్ధదేవ్‌ భట్టాచార్య 2000వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2011 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. తన పామ్‌ అవెన్యూ అపార్ట్‌మెంటుకే పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు చిట్టచివరిసారిగా ఆక్సిజన్‌ సాయంతో కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పెరేడ్‌ మైదానంలో జరిగిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ర్యాలీకి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 2015లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ నుండి కూడా వైదొలిగారు. 2018లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం నుండి తప్పుకున్నారు.