మధ్యప్రదేశ్‌ బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తగా బుద్దసేన్‌ పటేల్‌

– సీఎం సమక్షంలో పలువురు చేరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తగా బుద్దసేన్‌ పటేల్‌ను కేసీఆర్‌ నియమించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని సర్కారు తన లక్ష్యాన్ని విస్మరించిందని చెప్పారు. దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని విమర్శించారు. రానున్న రోజుల్లో చైతన్యమై, పార్టీలను కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరమున్నదని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో చాంద్వాడా జిల్లా, జున్నార్‌ దేవ్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్‌ దాస్‌, యికే సర్వజన్‌ కళ్యాణ్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు సంజరు యాదవ్‌, గోండ్వానా పార్టీ అధ్యక్షులు శోభారామ్‌ బాలావి, భువన్‌ సింగ్‌ కోరం, లక్ష్మణ్‌ మస్కోలేతోపాటు దాదాపు 200 మంది సీనియర్‌ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్‌ కదమ్‌, హిమాన్షు తివారీ, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్‌, మెట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.