బుద్ధిజం – బ్రాహ్మనిజం: ఏదిముందూ? ఏదివెనక

Buddhism - Brahmanism: What is it? Howeverబుద్ధిజం ముందా? బ్రాహ్మనిజం ముందా? అని చాలామంది తర్జన భర్జన పడుతుంటారు. ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ ఉంటారు. నిజాల నిగ్గు తేల్చుకోవాలంటే ఎవరైనా సరే ఆధారాలు వెతకాలి, ఉట్టి గాలి కబుర్లతో వాస్తవాలు వెలుగులోకి రావు. దొరికిన ఆధారాలలో ఏది పాతవి ఏవి కొత్తవి అనేది నిర్ధారించుకోవాలి! అప్పుడు విషయం తేటతెల్ల మవుతుంది. దేని ఆధారాలు పాతవైతే, ఆది ముందొచ్చింది అని అనుకుంటాం! ఇక వివరాల్లోకి వెళదాం – దొరికిన వేదాల మాన్యుస్క్రిప్టు సాధారణ శకం 1464 నాటిదని 2007లో యునెస్కో ధృవీకరించింది. ‘వేదాలు, పురాణాలు అన్నీ ఆ దేవదేవుడే మనిషికి అందించాడు’ -అన్న దానికి ఏ ఆధారమూ లభిóంచలేదు అది కేవలం ఒక భావన, ఒక విశ్వాసం మాత్రమే!
అది అలా ఉంచి చారిత్రిక ఆధారాలు చూస్తే అతి ప్రాచీనమైన అశోకుడి శిలా శాసనాలు, ఆ తర్వాత వచ్చిన బౌద్ధ రాజుల శాసనాలు అన్నీ ధమ్మలిపిలో ఉన్నాయి. ఆ శాసనాలు ధమ్మలిపిలో ప్రకటిస్తున్నామని ఆ శాసనాల్లోనే చివర ఎక్కడో రాసేవారు. ఆ విషయం బౌద్ధ గ్రంథాలలో కూడా ఉంది. ఇక బ్రాహ్మనిజానికి సంబంధించిన గ్రంథాలలో ఈ లిపి గురించిన ప్రసక్తే ఉండదు. మన దేశం పర్యటించిన ఇరానియన్‌ యాత్రికుడు, మేధావి, అల్‌ బరూనీ ప్రకారం పదకొండవ శతాబ్దం (జ.జు) దాకా వేదాలు రాయబడనే లేదు, కాశీలోని పాండాలు (పురోహితులు) కొందరు అశోకుని స్థూపాన్ని భీముని గధగా ప్రకటించారు. దాని మీద ఉన్న రాత (లిపి)వారికి ఆర్థం కాలేదు. అందువల్ల, వనవాసానికి సంబంధించిన అంశాలు దాని మీద ఉన్నాయని ప్రచారం చేశారు. అప్పటి నుండి ఈనాటి దాకా అబద్దపు ప్రచారాలలో వారిది అందెవేసిన చేయి!
భారత దేశానికి సంబంధించిన పాలి/ పాక్విత్‌ (ప్రాకృతం) అతి పురాతనమైన భాషలు, 3400 సంవత్సరాల క్రితం ఆసియా మైనర్‌లో లభించిన హితీ – భాషా శాసనాలలో కూడా పాక్విత్‌ (ప్రాకృత) భాషా ప్రభావం ఉందని తేలింది. ఆ కాలం నాటి శాసనాలలో పరిశోధకులకు ఎప్పుడూ ఎక్కడా సంస్కృత భాషా శాసనాలు లభించలేదు. అందువల్ల బ్రాహ్మనిజానికి తమదైన ఒక భాషే ఉనికిలో లేదని చరిత్ర చెపుతోంది. పాలి, పాక్విత్‌ (ప్రాకృతం) స్థానికంగా ఉన్న ఇతర భాషలు తప్ప సంస్కృతం లేదు తర్వాత కాలంలో ఒక బౌద్ధ మేధావి భాషను సంస్కరించి – సంస్కృతం తయారు చేశాడు. సంస్కృతం అర్థం కూడా అదే! సంస్కరించబడింది అని!! ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు. పాలి – ప్రాకృతం సంస్కరించబడినవి కావు. ప్రాకృత – అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ మూల భాషలు. బ్రాహ్మనిజానికి సంబంధించిన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. అంటే, అవి భాష సంస్కరించడిన తర్వాత – తర్వాత కాలంలో రాయబడ్డాయి. బ్రాహ్మనిజానికి సంబంధించిన అతి ప్రాచీన సంస్కృత గ్రంథాలు ఎందుకు లభించలేదూ? అంటే, చాలాకాలం వరకు అవి రాయబడలేదు. ఎవరూ ఎందుకు రాయలేదూ అంటే, ఆ భాషకు అప్పటికి లిపి లేదు. కాబట్టి – లిపి లేని ఒక మాండలిక భాష (కేవలం మాట్లాడగలిగేది) సంస్కరించబడి సంస్కృతమైంది. ఆర్యులతో పాటు ఈ దేశం వచ్చిన ఆ భాష, ఇక్కడి నాగరి లిపిని స్వంతం చేసుకుంది. నాగరి లిపిలో రాయబడుతూ వస్తూ ఉంది. నాగరిలిపిని ఉన్నతీకరించి ఆర్యులు దాన్ని ‘దేవనాగరి’అని అన్నారు. ఏకంగా ఆ భాషను ‘దేవభాష’ అని ప్రకటించుకున్నారు కూడా!
ఇక పురాతత్వ దృష్టికోణంలో చూస్తే, బుద్ధిజానికి సంబంధించి – అతి పురాతన శిలా శాసనాలు, కట్టడాలు, గ్రంథాలు, పత్రాలు అన్నీ దొరికాయి. కేవలం మన దేశంలోనే కాదు, చుట్టు పక్కల ఉన్న ఇతర దేశాలలో కూడా దొరికాయి. దర్శించడానికి, పఠించడానికి కూడా ఆధారాలు దొరికాయి. బ్రాహ్మనిజానికి సంబంధించిన పురాతన కట్టడాలు, పురాతన శాసనాలు, పురాతన గ్రంథాలు ఏవీ లేవు. పురాణ పాత్రలైన రాముడు, కృష్ణుడు నిజంగా బతికి ఈ దేశాన్ని పరిపాలించి ఉంటే, వారు కట్టించిన కట్టడాలు, వారు వేయించిన శాసనాలు, వారి నాణాలు, వారు వాడిన వస్తువులు వగైరా భూమి పొరల్లో ఎక్కడో దొరకాలి కదా? వారు చారిత్రక పురుషులు కాదు కాబట్టి, ఏవీ దొరక లేదు-పురాణ పురుషులు కాబట్టి, పురాణాల్లోనూ, విశ్వాసకుల విశ్వాసాల్లోనూ ఉంటారు. బ్రాహ్మనిజం కల్పించుకున్న పురాణ పాత్ర లేవీ ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా పుట్టినవి కావు. దేవ దేవతల అస్థిత్వానికి సంబంధించిన ఆధారాలు ధార్మిక భావనల్లో మాత్రమే ఉంటాయి. ప్రపంచ దేశాల్లో వేల సంఖ్యలో మతాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన దేవీ దేవతల చారిత్రక ఆధారాలు దొరకవు. ఇక, బుద్ధుడు, మహా వీరుడు వంటి వారు వేరు. వారు నిజంగా ఈనేల మీద నడయాడిన వారు. వాల్మీకి రామాయణంలో బుద్ధుణ్ణి తిట్టడం ఉంది.అంటే రామాయణం రాయబడక ముందే బుద్ధుడున్నాడని తెలిసింది కదా? ఇక ఎందుకు చర్చ? ఏది ముందూ, ఏది వెనక అనేది అక్కడే తేలిపోయింది.
ఇంతెందుకూ? సుమారు 70 దాకా బౌద్ధ విశ్వవిద్యాలయాలు బయటపడ్డాయి. అందులో దేశదేశాల విద్యార్థులు చదువుకున్నారని చరిత్ర చెపుతోంది. మరి బ్రాహ్మనిజానికి సంబంధించిన గురుకు లాలు, వేద పాఠశాలలు ఒక్కటి కూడా ఎందుకు బయటపడలేదూ? పైగా చదివిన వాడి నాలుక కోసి, విన్నవాడి చెవుల్లో సీసం పోసి, దేశంలోని అధిóక సంఖ్యాకుల్ని విద్యకు దూరం చేశారు కదా?
బుద్ధుడి, బోధిసత్యుడి, అవలోకితేశ్వర్‌, మహామాయ (బుద్ధుడి తల్లి) శిల్పాలు, ప్రతిమలు దేశంలోనే కాదు, విదేశాలలో కూడా లభిస్తున్నాయి. కానీ, బ్రాహ్మనిజానికి సంబంధించిన శిల్పాలు భూమి పొరల్లో దొరకలేదు. ఇప్పుడు మనం దేవాలయాల్లో చూస్తున్న ప్రతిమలన్నీ, మార్చుకున్న బుద్ధుడి ప్రతిమలో లేక ఇటీవల కాలంలో కొత్తగా చెక్కి పెట్టుకున్నవో అయి ఉంటాయి. అలనాడు బౌద్ధులు బుద్ధుడి తల్లి మహామాయ విగ్రహాలు చెక్కిపెట్టు కుంటే, వాటిని మార్చి లక్ష్మి, పార్వతి, సరస్వతి విగ్రహాలుగా ప్రకటించి, పూజల పేరుతో కొందరు జీవనాధారం వెతుక్కు న్నారు. అలాగే బోధి సత్యుడి విగ్రహాలన్నీ మార్చి విష్ణు శివుడు వంటి కల్పిత దేవతల ఆలయాలు చేసుకున్నారు. అది కూడా కొందరి జీవనాధారం కోసమే! సందర్శకులు జాగ్రత్తగా గమనిస్తే ఆయా విగ్రహాల పైన గానీ, కుడి ఎడమ వైపులో గానీ బుద్ధుడి ప్రతిమలు తప్పక కనిపిస్తాయి. బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన చోటు- ఉత్తర ప్రదేశ్‌లో గోరక్‌పూర్‌కు 33 మైళ్ల దూరంలో తూర్పున కుషీనగర్‌ (పాలి: కుషినార)లో ఉంది. అక్కడ బౌద్ధ శిల్పులు పడుకుని ఉన్న బుద్ధుడి శిల్పం చెక్కుకున్నారు. దాన్ని కాపీ కొట్టి కదా బ్రాహ్మణ వాదులు శేషనాగుపై పవళించి ఉన్న విష్ణు మూర్తికి రూపకల్పన చేసుకున్నారూ? ఇలా ఎన్నయినా చెప్పుకో వచ్చు.
నిత్య జీవితంలో మనం వాడుతున్నది కూడా బుద్ధిస్టు- కేలండరే. బౌద్ధుల యుగాబ్ద కేలండర్‌నే తొమ్మిదో శతాబ్దం తర్వాత మాల్యా కేలండర్‌లో వాడుకున్నారు. అదే విక్రమ్‌ సంవతు పేరుతో చలా మణి అయ్యింది. బ్రాహ్మ నిజానికి సంబంధించిన కేలండర్‌ ఏదీ లేదు. ఉన్న ఆ కేలండర్‌లోనే తిధి, వార, నక్షత్రాల వంటి మూఢనమ్మకాలు నింపి, జనాన్ని భయపెట్టి తమ ప్రాముఖ్యం చాటుకుంటూ బతుకుదెరువు చూసుకున్నారు. మనిషి ఆధినికుడు కావడంలో గానీ, అతన్ని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవ డంలో గానీ, ప్రపంచ శాంతి స్థాపనలో గానీ, బ్రాహ్మనిజం పాత్ర ఏమీ లేదు. బౌద్ధ జాతక కథలు, బౌద్ధ చింత్రాలు 2200 ఏండ్లకు ముందు నుండే ఉన్నాయి. దీనికి ఒక మంచి ఉదా హరణ అజంతా గుహల్లో ప్రసిద్ధి పొందిన బౌద్ధచిత్రాలు! ఇప్పటికీ అవి పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అబ్బుర పరుస్తున్నాయి. వాటికి పూర్వం గానీ, అవి రూపొందించబడ్డ కాలంలో గానీ, ఆ తర్వాత గానీ బ్రాహ్మనిజానికి సంబంధించిన చిత్రాలు, గ్రంథాలు ఎక్కడా ఎందుకు లభించలేదో ఆలోచించాలి. రామాయణం, మహాభారతం వంటి కావ్యాలు 10వ దశాబ్దానికి ముందు ఉన్నట్టు ఆధారాలే లేవు. అలా రాయబడ్డ కావ్యాల మీద బౌద్ధ జాతక కథల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాల్ని ఎందరో పరిశోధకులు విశ్లేషించారు కూడా! ఇండియాకు భారతదేశం అనే పేరు భరతుడు పాలించినందువల్ల రాలేదు. భరత-అంటే నిండుగా ఉన్న దేశం. భారత అంటే బరువైన/ గొప్పదైవ దేశం-అందువల్ల దీన్ని భారతదేశం అని అనొచ్చు. ఇది మతాలకు అతీతంగా కలిసి మెలిసి బతికే దేశం!
ఇక కొబ్బరి కాయలు కొట్టడం, ఇంటి గుమ్మానికి గుమ్మడి కాయలు కట్టడం వంటి, బ్రాహ్మనిజం ప్రచారం చేసిన సంప్రదాయాలకు మూలాలు ఎక్కడో చూద్దాం! పుష్యమిత్ర శృంగుడనే బ్రాహ్మణ రాజు సాకేత్‌ (అయోధ్యకు పాత పేరు)ను ఆక్రమించుకుని దాని పేరు. ఆ-యుద్ధ (అయోధ్య) అని మార్చాడు. అంటే యుద్ధం లేకుండా తను ఆ నగరాన్ని రాజధానిగా చేసుకున్నానని ప్రకటించుకోవడం. ఆ పుష్యమిత్ర శృంగుడే తనను రాముడిగా చిత్రించుకుంటూ రామాయణం రాయించుకున్నాడు- అది వేరే కథ! బౌద్ధాన్ని నాశనం చేసి, తన వైదిక మతాన్ని ప్రచారం చేయాలనుకున్న ఈ శృంగుడు-బౌద్ధభిక్షుల తలలు నరికి తెచ్చిన వారికి వంద బంగారు నాణాలు ఇచ్చేవాడు. ఎక్కవ నాణాలకు ఆశపడిన కొందరు, ఒకే తలను మళ్లీ మళ్లీ చూపించి నాణాలు తెచ్చుకునేవారు. ఆ విషయం తెలుసుకున్న పుష్యమిత్ర శృంగుడు నరికి తెచ్చిన తలల్ని నదీ తీరానికి పంపించి అక్కడ రూపురేఖలు తెలియకుండా బండకేసి కొట్టించేవాడు. అలా చిదిమేసిన తలల్ని ఎవరూ తెచ్చి చూపలేరు కదా? అప్పుడు ఆ నది సర్‌యుక్తనది (సర్‌యుక్త-అంటే తలలతో కూడిన నది) అయ్యింది.కాలక్రమంలో అదే సరయూ నది అయ్యింది. తనను తాను మర్యాద పురుషోత్తముడిగా భావించుకుని రామాయణ కావ్యం రాయించుకున్నవాడు ఎంత క్రూరుడో-సరయూ నదీతీరాన ఎంత విధ్వంసం జరిపించాడో తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడు స్తుంది. బ్రాహ్మనిజం ఇంత ఘోరమైందా- అని మనసు కకావికలమౌ తుంది. తర్వాత కాలంలో కొబ్బరికాయలు భిక్షుల తలలకు ప్రతీకగా మారాయి. దేవుడికి సమర్పిస్తున్నామన్నట్లుగా కొబ్బరికాయలు బండ మీద పగల గొట్టడం ఆచారమైంది. తాము భిక్షు తలనరికి రాజు దగ్గర బంగారు నాణాలు సంపాదించామని డాబుగా ప్రపంచానికి చెప్పుకోవడానికి – తల ఆకారంలో ఉండే గుమ్మడి కాయను ఇంటి గుమ్మానికి కట్టుకునే వారు. తమ సాహస కృత్యాన్ని అలా సమాజానికి తెలియజేసే వారు. అది ఒక హింసాత్మక చర్య అన్న భావన కలగడంతో- ‘వేరే వాళ్ల దిష్టి తగలకుండా’ కట్టుకుంటున్నా మనేవారు.
బౌద్ధిజమా?బ్రాహ్మనిజమా? ఏది ముందూ ఏది వెనక అని నిగ్గు తేల్చుకోవడానికి సాక్ష్యాధారాలే ముఖ్యం! ఆధారాలు లేకుండా మనోభావాలతో విషయం చర్చిస్తామంటే కుదరదు.ఎవరి విశ్వాసాలు వారు నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. అంత వరకు సరే-కానీ తమ విశ్వాసాలే నిజం-వాటినే అందరూ విశ్వసించాల ంటే కష్టం – అది అయ్యేపని కాదు. బుద్ధిజం ప్రాచీనం (సనాతనం) అయినా, అది ఆధునిక కాలానికి ఉపయోగపడేది. తర్వాత కాలంలో క్రమంగా రూపుదిద్దుకున్న బ్రాహ్మనిజం ఆధునికుల్ని పురాతన సమాజంలోకి నడిపిస్తోంది! అదీ తేడా!! అయినా ఏది ముందు ఏది వెనకా అనేది కూడా అనవసరం. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఏది ఉపయోగమో దాన్నే స్వీకరించాలి! వివేకవంతులు చేయవల్సిన పని అదే!!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు