రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

– వర్షంతో ముమ్మరంగా పత్తి విత్తనాల సాగు
నవతెలంగాణ – బోనకల్‌
మండల కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన వర్షం రైతుల్లో ఆశలను రేకెత్తించింది. గత వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తుతాయోలేదోనని అన్నదాతలు ఆందోళన చెందారు. జూన్‌ నెల ప్రారంభం నుంచే అన్నదాతలు పత్తి విత్తనాలను సాగు చేస్తున్నారు. నేటికీ దాదాపు మండల వ్యాప్తంగా సుమారు 5000 ఎకరాలలో పత్తి విత్తనాలను సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. గత ఏడాది వరకు అన్నదాతలో పొలంలో పదును ఉంటేనే పత్తి విత్తనాలను నాటేవారు. పత్తి విత్తనాలు నాటిన రెండు మూడు రోజులు వరకు వర్షాలు లేకపోతే అవి మొలకెత్తేవి కావు. దీంతో రైతుల తీవ్రంగా నష్టపోయేవారు. కానీ ప్రస్తుతం రైతులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పదునులోనే విత్తనాలను నాటుతున్నారు. నాటిన తర్వాత సుమారు పది రోజుల వరకు వర్షాలు లేకపోయినా విత్తనాలకు ఎటువంటి నష్టం ఉండదు. అవి భూమిలో వేసిన దెబ్బ తినకుండా పదిలంగానే ఉంటాయి. పది రోజుల తర్వాత వర్షాలు వచ్చినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయని అన్నదాతలు అంటున్నారు. గురువారం కురిసిన వర్షాల వల్ల శుక్రవారం వ్యవసాయ పొలాలన్నీ పత్తి విత్తనాలు నాటే కూలీలతో కలకలలాడాయి. పెద్ద ఎత్తున రైతుల విత్తనాలను నాటించారు. దీంతో వానాకాలంలో పత్తి విత్తనాల సాగు ముమ్మరంగా సాగుతోంది. ఒకవైపు రైతులలో ఆనందం వ్యక్తం అవుతుండగా మరొకవైపు వర్షాల రాకపై ఆందోళనలో ఉన్నారు.