ఈనెల 1న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి 2025-26 సంవత్సరానికిగాను రూ.50,65,345 లక్షల కోట్లతో పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.గంటా పదిహేను నిమిషాల సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖా మంత్రి నాలుగుసార్లకు పైగా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపుల గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మాట లేకపోగా, కేటాయింపులూ అరకొరే. వివిధ శాఖలకు కేటాయింపులు రూ.లక్షల కోట్లల్లో ప్రవేశపెట్టబడినా, వాస్తవ ఖర్చులు 26శాతం నుండి 46 శాతం వరకే. అధిక ధరలతో ప్రజల జీవనవ్యయం పెరిగిపోతూ ఉండగా, వీటిని తగ్గించడానికి ఏ రకమైన చర్యలు లేవు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కేటాయింపులు రైతుల అవసరాలకు తగ్గట్టుగా లేకపోగా, ఎరువుల ధరల సబ్సిడీలను తగ్గించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల గురించి రైతులు నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ ఈ విషయంలో నిర్దిష్టమైన చర్యలు లేకపోవడం విచారకరం. ఇదిలా ఉంటే దేశ అప్పు రూ.181లక్షల కోట్లకు చేరింది. ఇంకా విదేశీ రుణాలు మరో రూ.6లక్షల కోట్ల వరకు ఉంటాయి. ఈ బడ్జెట్‌లో రూ.12,76,338 లక్షల కోట్లు తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులకే కేటాయించారు. ఇది సుమారు మూడు,నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానంగా ఉంటుంది! అంటే, వడ్డీలకే ఇంత బడ్జెట్‌ను కేటాయింస్తే అసలు చెల్లించడానికి ఎన్ని దశాబ్దాలు కావాలి? ఇదంతా ఎక్కడినుంచి తెస్తారు? దేశ ప్రజలపై భారాలు వేసే కదా! ఇది పౌర సమాజం ఆలోచించాలి.
ప్రజల కనీస అవసరాలైన ఇండ్లు, విద్య, వైద్యం విషయంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తూ తీసుకుంటున్న చర్యలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. పన్నుల భారాలు ప్రజల జీవితాలకు గుదిబండలా మారాయి. జీఎస్‌టీ ప్రవేశపెట్టినప్పుడు నెలకు రూ. 60వేల కోట్లుగా ఉన్న పన్నులు, గత నెల రూ.1,92,000 కోట్లకు చేరుకున్నాయి. కనపడిన ప్రతి వస్తువుపై జీఎస్‌టీ పేరుతో పన్నులు విధించడం బ్రిటీష్ కాలంనాటి పన్నుల విధానాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మహిళలు రవికలు వేసుకోవాలన్నా పన్ను, అడవిలో కట్టెలు కొట్టుకోవాలన్నా పన్ను, ఉప్పుపై పన్ను, ఈ విధంగా కనపడిన ప్రతిదానిపై పన్నులు విధిస్తే, ఆ రోజు ప్రజలు పన్నుల భారాలకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడి, విజయాలు సాధించుకుని బ్రిటీష్ ప్రభుత్వాన్ని దేశం నుండి వెళ్లగొట్టిన చరిత్ర భారతీయులది. నేడు పసి పిల్లలు తాగే పాల ప్యాకెట్లపై ప్రాథమిక దశలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పెన్సిల్, రబ్బర్‌పై కూడా పన్నులు వేస్తూ అనాగరికంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి నేడు ఉన్నది. లక్షలాదిగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే విషయం ఆలోచించకుండా, నిరుద్యోగులు ఉద్యోగాలకై చేసే దరఖాస్తులపై కూడా పన్నులు విధించడం దారుణం. గత పదేండ్లలో ఐదు కోట్లకు పైగా పేదలకు గృహాలు నిర్మించి ఇచ్చినట్లుగా చెపుతున్న కేంద్రం రాబోయే రోజుల్లో మరో కోటికి పైగా గృహాలను నిర్మిస్తామని తెలియజేసింది. కానీ వాస్తవంలో పేద ప్రజల ఇండ్ల నిర్మాణానికి ప్రతి గృహానికి కేంద్రం తరపున పట్టణాల్లో రూ.లక్షా 50వేలు, గ్రామాల్లో రూ.75వేలు మాత్రమే కేటాయిస్తున్నది. మిగతా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. కానీ మధ్య తరగతి స్వంతంగా ఇల్లు నిర్మించుకోవాలంటే సిమెంట్‌పై 28 శాతం, ఇనుముపై 18 శాతం, ఇంటికి సంబంధించిన పింగాళి సామాగ్రి, ఇతర వస్తువులపై 18 శాతం జీఎస్‌టీ రూపేణా వసూలు చేస్తున్నది. అపార్ట్ మెంట్లల్లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ సందర్భంగా జీఎస్‌టీ వసూళ్లు చేస్తున్నది. ఇది మధ్య తరగతి స్వంత ఇండ్ల కలను నీరుగార్చేదిగా ఉన్నది.
సినిమా హాల్లో చిన్నపిల్లలు, పెద్దలు విరామ సమయంలో ఇష్టంగా తినే పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్‌టీలను విధించడం ఈ మధ్యనే చూసాము. కార్మికులు తమ నిజ వేతనాలు కోల్పోతూ, పిల్లల విద్య, వైద్యం, ఇతర ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ జీవితాలు దుర్భరంగా గడుపుతున్న పరిస్థితులు నేడు నెలకొన్నాయి. వారు తమ వేతనాలు నెలకు కనీసంగా రూ.26వేలు చేయాలని చేస్తున్న డిమాండ్లు పరిష్క రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి పేరుతో 500లకు పైగా స్మార్ట్ సిటీలు, 100కు పైగా అమృత్ సిటీలను ప్రకటించి వాటి అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదు. గతేడాది పట్టణాభివృద్ధికి రూ.82,577 కోట్లు ప్రక టించగా, ఈ ఏడాది అతి కొద్ది మొత్తం పెంచి రూ.96,777 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలైనా నీరు, డ్రెయినేజీ, విద్యుత్, రోడ్లు, గృహ అవసరాలకు కేటాయించిన మొత్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజా రవాణా విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపర్చకపోగా విమానాశ్రయాల నిర్మాణాలపై కేంద్రీకరిస్తున్నట్లుగా తెలియజేశారు. పట్టణాభివృద్ధికి కేటాయించిన మొత్తాలు జీడీపీలో 0.3 శాతం మాత్రంగానే ఉన్నాయి. ఈ బడ్జెట్ అంతా కూడా పేదల్ని కొట్టి, పెద్దలకు పెట్టే బడ్జెట్‌లాగే ఉంది. ఇది ఏమాత్రం ప్రజల బతుకుల్ని మార్చదు, కొనుగోలుశక్తిని అంతకన్నా పెంచదు. అందుకే బడ్జెట్‌ను వెంటనే సవరించాలి. ప్రజోపయోగ కార్యక్రమాలపై కేంద్రీకరణ జరగాలి. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న రాయితీలను తగ్గించి, వారి ఆదాయాలపై నాలుగు శాతం పన్నును విధించాలి. ఈ అసంబద్ధ బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహా ధర్నాలో కార్మికులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, వృత్తిదారులు, ఇతర కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలి.
– డిజి నరసింహారావు, 9490098580