– గత ప్రభుత్వ అబద్ధాలు,అవినీతిపై విచారణ
– సచివాలయం, అమరవీరుల స్థూపం,
– అంబేద్కర్ విగ్రహ నిర్మాణ వ్యయాలపై విజి’లెన్స్’
– ఛత్తీస్‌గఢ్‌తో బీఆర్ఎస్ సర్కారు
– విద్యుత్ కోనుగోలు ఒప్పందంపైనా..
– భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలపై కూడా సాగుచేస్తున్నవాళ్లకే రైతుబంధు…. రుణామాఫీ చేస్తాం
– మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అన్ని విధాలుగా విచారణ చేపడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాల వ్యయంపై కూడా విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ చేశామనీ, రిటైర్డ్ జడ్జీతో జ్యుడిషియల్ విచారణ సైతం జరగనుందన్నారు. ఈ సందర్భంగా అసలు విషయాలు బయటకొస్తాయని సీఎం అన్నారు. విద్యుత్ప్రాజెక్టులు, కొనుగోళ్లపై అరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కూడా విజిలెన్స్ విచారణ చేస్తామని ప్రకటించారు. అలాగే భద్రాద్రి, యాద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయాలపై కూడా చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ అవినీతి జరిగినా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మేడిగడ్డ పనులు చూసేందుకు ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించామనీ, 13వ తేదీన బీఆర్ఎస్ వాళ్లకు మీటింగ్ ఉంటే వేరే తేదీ ఏదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు లేదా వెనుక వెళదాం అన్నా తాము సిద్దమని ప్రకటించారు . తెలంగాణలో రైతుబంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని అన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమనీ, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల భూములు పోయిన వారికి రైతుబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి అందినప్పుడే మేలు జరుగుతుందని చెప్పారు. ఆరోగ్య కార్డును ప్రత్యేకంగా ఇస్తామనీ, రాష్ట్రంలోని ప్రతిపౌరుడికి డిజిటల్ కార్డు అందుతున్నారు. రాజ్యసభకు రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం ఉందనీ, కాంగ్రెస్ నుంచే ఉంటారని చెప్పారు.ఎవరనేదీ ఇప్పుడు చెప్పలేమన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న విషయాన్ని గురు చేయగా, ఆ విషయం నాకుతెలియదనీ, నాదృష్టికి తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం సొంత ఎమ్మెల్యేలను సైతం నమ్మడం లేదని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో అందరిని కలుపుకుపోతామని చెప్పారు. కలుపుకుపోతారా..పార్టీలో కలిపేసుకుంటారా అన్న ప్రశ్నకు సీఎం స్పందించలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు రూ. 16 వేల కోట్ల వడ్డీ మీద పడుతున్నదని గుర్తు చేశారు. ఇది గత సర్కారు పాపమని వివరించారు. అసెంబ్లీ ఒటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో సీఎం చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలుచుకోలేదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. అబద్ధాలు చెపితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని చెప్పారు. పదేండ్లయినా కేసీఆర్‌కి బడ్జెట్ అంచనా వేయడం రాలేదని వాఖ్యానించారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కకు అభినందనలు తెలిపారు. తక్కువ సమయంలో భట్టి ఆర్థిక శాఖను అవగాహన చేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీని అమలుచేస్తామని సీఎం మరోసారి చెప్పారు. బ్యాంకులతో చర్చిస్తున్నామనీ, అవి పూర్తికాగానే రుణమాఫీ జరుగుతుందన్నారు. రుణమాఫీ అనంతరం బ్యాంకులకు కిస్తుల రూపంలో కట్టుకుంటామని ప్రకటించారు. మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా రాబడతామని అన్నారు. మనం కట్టే పన్నులే వారు తిరిగి ఇస్తున్నారనీ, ఇందులో ప్రతిపైసా తెచ్చుకుంటామని వివరించారు. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు.
తెలంగాణ భాష ఇలాగే ఉంటుంది..
అసెంబ్లీ ప్రొసీజర్ అంతా స్పీకర్ చూస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీరు మాట్లాడే భాష సరిగ్గా ఉండటం లేదని విలేకర్లు అడగ్గా ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పే అంశం సభా అధికారులు చూసుకుంటారని అన్నారు. తెలంగాణ భాష ఇలాగే ఉంటుందని అన్నారు. 2014లో టీడీపీ బీఏసీ మెంబర్లుగా తనను, ఎర్రబెల్లి దయాకర్‌రావును పార్టీ నిర్ణయించిందనీ కానీ హరీష్‌రావు తనను బీఏసీకి రానివ్వలేదని సీఎం గుర్తు చేశారు.