
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులకు ఇచ్చిన హామీలన్నిటినీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి బడ్జెట్ లో ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించకుండా గిరిజనులకు మోసం చేసిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్, మ్యానిఫెస్టోలలో గిరిజనులకు 15 రకాల హామీలు ఇచ్చిందని అన్నారు. హామీలలో కొన్నిటినైనా అమలు చేయడానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన గిరిజనులకు గుండు సున్నా ఇచ్చి ద్రోహం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఏమీ లేదని నిరూపించిందన్నారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో గిరిజన సంక్షేమానికి 17,056 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పడం వాస్తవం కాదని అన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రగతి పద్ధులో వాస్తవ కేటాయింపులు 14,457 మాత్రమేనని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల్లో ఇతర శాఖలో కేటాయించిన వాటిని గిరిజన సంక్షేమ శాఖలో కలిపి పెంచామని చెప్పి అంకెలు గారేడికి పాల్పడిందని అన్నారు. బడ్జెట్లో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్ధంగా కేటాయించాల్సిన సబ్ ప్లాన్ నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మొత్తం రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ.2,20,945 లక్షల కోట్లలో గిరిజనుల జనాభా నిష్పత్తి 10శాతం ప్రకారం 22వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులతో కలిపి కేవలం 17,056 కోట్లు మాత్రమే కేటాయించడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమేనని అన్నారు. ట్రై కార్ సంస్థ ద్వారా గిరిజనులందరికీ 90 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తామన్న ప్రభుత్వం గత ప్రభుత్వం కేటాయించిన 426 కోట్లలో తగ్గించి ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. చేవెళ్ల డిక్లరేషన్లో అంబేద్కర్ అభయస్తం పేరుతో ప్రతి గిరిజన కుటుంబానికి గిరిజన బంధు తరహాలో 12 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తామన్న హామీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. సమ్మక్క సారక్క గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామపంచాయతీలకు ప్రతి ఏటా రూ. 25 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామన్న హామీని గాలికి వదిలేసారని ఆరోపించారు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 5 ఐటిడిఏలను ఏర్పాటు చేస్తామన్న హామీకి బడ్జెట్లో కేటాయింపులే చేయలేదన్నారు. గిరిజనులకు ప్రత్యేకంగా హక్కుల కమిషన్ ఏర్పాటు వంటి హామీలపై కనీస గ్యారెంటీ కూడా ఇవ్వకుండా గిరిజనులకు మోసం చేసిందన్నారు.