– సెన్సెక్స్ 739 పాయింట్ల పతనం రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ భయాలు నెలకొన్నాయి. వచ్చేవారం బడ్జెట్ నేపథ్యంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చనే అంచనాల్లో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా వారాంతం సెషన్లో భారీగా అమ్మకాలకు దిగారు. దీంతో ఒక్క పూటలోనే రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సూచీలు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపట్లోనే క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అన్ని ప్రధాన సూచీల్లో అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 738.81 పాయింట్లు పతనమై 80,604.65కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 270 పాయింట్లు కోల్పోయి 24,530 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో 26 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.454.4 లక్షల కోట్ల నుంచి రూ.446.4 లక్షల కోట్లకు తగ్గింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో అన్ని రంగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. లోహ సూచీ అధికంగా 4 శాతం నష్టపోగా.. రియాల్టీ 2.66 శాతం, ఆటో 2.4 శాతం చొప్పున విలువ కోల్పోయాయి.