రేపటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

Budget meetings from tomorrow– నేడు అఖిలపక్ష భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వ చివరి పార్లమెంట్‌ (బడ్జెట్‌) సమావేశాలు జనవరి 31 (రేపటి) నుంచి జరుగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నేడు (మంగళవారం) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశముంది. ఇవి లోక్‌సభ చివరి సమావేశాలు. జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 9 వరకూ జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి బుధవారం ప్రసంగించనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపే తీర్మానంపై చర్చ ఉంటుంది. అలాగే మధ్యంతర బడ్జెట్‌పై కూడా చర్చించనున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు కేవలం పది రోజులే కావడంతో, ఈ స్వల్ప కాలంలో ఏయే అంశాలు లేవనెత్తాలనే అంశంపై ప్రతిపక్షాలు చర్చిస్తున్నాయి. 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్‌ సమావేశం కావడం ఇదే చివరిసారి.