ఎల్‌ఐసీకి బంఫర్‌ లాభాలు

– ఈక్విటీల్లో రూ.2.3 లక్షల కోట్ల రాబడి
– 2023లో అనేక స్టాక్స్‌లో రెండంకెల రిటర్న్స్‌
ముంబయి : ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ అదిరిపోయే లాభాలను సాధించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పోర్టుపోలియోలో పెట్టిన పెట్టుబడులపై 2023లో ఏకంగా రూ.2.8 లక్షల కోట్లు ఆర్జించింది. ఇటీవల దలాల్‌ స్ట్రీట్‌ దూసుకుపోతున్న నేపథ్యంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) లాభాలు కూడా అమాంతం పెరిగాయి. గతేడాది డిసెంబర్‌ ముగింపు నాటికి ఎల్‌ఐసీ మార్కెట్‌ హోల్డింగ్‌ పెట్టుబడులు రూ.9.61 లక్షల కోట్లుగా ఉండగా.. అవి ప్రస్తుతం రూ.11.89 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఏస్‌ ఈక్విటీ గణంకాలు వెల్లడించాయి. 260 లిస్టెడ్‌ కంపెనీల్లో ఎల్‌ఐసి పెట్టుబడులను కలిగి ఉంది. ఎల్‌ఐసి వాటా, స్టాక్‌ల ప్రస్తుత మార్కెట్‌ ధర ఆధారంగా మార్కెట్‌ విలువ లెక్కించబడిందని ఏస్‌ ఈక్విటీ పేర్కొంది.
ఏడాదికేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో నిఫ్టీ-50 ఏకంగా 19 శాతం రిటర్న్‌లు ఇచ్చింది. మార్చిలో దాదాపు 52 వారాల కనిష్టానికి పడిపోయినప్పటికీ.. ఆ తర్వాత 28 శాతం ర్యాలీ చేసి బుధవారం 21,655 పాయింట్లకు చేరింది. 2023లో ఇప్పటి వరకు ఎల్‌ఐసి నిఫ్టీ 50 స్టాక్స్‌లో 40 సూచీలు కూడా 86 శాతం వరకు రెండంకెల లాభాలతో రిటర్న్స్‌ను ఇచ్చాయి. కోల్‌ ఇండియా, లర్సన్‌ అండ్‌ టర్బో, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ స్టాక్స్‌ అధిక లాభాలను అందించిన వాటిలో ఉన్నాయి.
ఎన్‌టీపీసీ..
దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీ ఎన్‌టీపీసీలో ఎల్‌ఐసీ పెట్టుబడులను రూ.2,400 కోట్లు పెంచింది. ఈ సూచీ 86 శాతం లాభపడింది. ప్రభుత్వ రంగ సూచీల్లో భారీ ర్యాలీ చేసి.. డిసెంబర్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరింది. బొగ్గు ఉత్పత్తి దిగ్గజ సంస్థ కోల్‌ ఇండియా సూచీ 63 శాతం పెరిగింది. ఇందులో ఎల్‌ఐసి పెట్టుబడుల విలువ ఒక సంవత్సరం లోనే 58 శాతం పెరిగి రూ.24,087 కోట్లకు చేరుకుంది.
ఎల్‌అండ్‌టీ మద్దతు
ఎల్‌ఐసి ఖజానా నింపిన స్టాక్స్‌లో లర్సన్‌ అండ్‌ టర్బో (ఎల్‌అండ్‌టీ) మూడో స్థానంలో ఉంది. ఈ దిగ్గజ మౌలిక వసతుల కంపెనీ షేర్‌ 2023లో 67 శాతం పెరిగింది. ఇందులో ఎల్‌ఐసి హోల్డింగ్‌ విలువ 46 శాతం పెరిగి రూ.52,786 కోట్లకు చేరింది. ఎల్‌ఐసి అధిక లాభాలందించిన స్టాక్స్‌లో టాటా మోటార్స్‌ కూడా ఉంది. 2023లో ఈ సూచీ 85 శాతం లాభపడింది. ఈ స్టాక్‌లో ఎల్‌ఐసీ రూ.13,519 కోట్ల పోర్టుపోలియో పెట్టుబడులు కలిగి ఉంది.
మరో 21 స్టాక్స్‌ల్లో..
ఎల్‌ఐసీ పెట్టుబడులు కలిగిన మరో 21 స్టాక్స్‌ 2023లో 328 శాతం రాబడులను ఇచ్చాయి. బీఎస్‌ఈలో పలు స్టాక్స్‌ మూడు రెట్లు పెరిగాయి. ఆ సూచీల్లోని ఎల్‌ఐసి పెట్టుబడులకు భారీగా రిటర్న్స్‌ వచ్చాయి. స్మాల్‌ క్యాప్‌ సెగ్మెంట్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ 250 శాతం పెరిగింది. ఇందులోనూ ఎల్‌ఐసీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి రూ.519 కోట్లకు చేరాయి. రైల్‌ వికాస్‌ నిగమ్‌ సూచీ 160 శాతం పెరగ్గా.. ఇందులో ఎల్‌ఐసి హోల్డింగ్స్‌ 2 రెట్లు పెరిగి రూ.2,076 కోట్లకు చేరాయి. 2024లోనూ భారీ లాభాలు కొనసాగవచ్చని అనేక ఫండ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి.