
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా భవన నిర్మాణ రంగంలో సేవలందిస్తున్న భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతినేలా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిల్డర్స్ ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను అతి తక్కువ కూలికి తెచ్చి స్థానిక కార్మికుల కడుపులు కొడుతున్నారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో పేరుమోసిన ఒక బిల్డర్స్ కంపెనీ యజమాని స్థానికులకు పని ఇవ్వకూడదని తీర్మానించిన బిల్డర్స్ కంపెనీకి భవన నిర్మాణ కార్మికుల నుండి చట్టబద్ధమైన తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన బహుజన భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర కమిటి సమావేశం మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకుల నుండి కోట్లాది రూపాయల రుణాల ద్వారా పొంది వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ బిల్డర్ వ్యాపారులు యూపీ,బిహార్, మహారాష్ట్రల నుండి కార్మికులను తెచ్చి ఎట్టి చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు. స్థానిక భవన నిర్మాణ కార్మికులు బిల్డర్స్ శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పిరాడుతారు కాబట్టి స్థానికులకు పని ఇవ్వడంలేదన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఇతర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెల్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టియు జిల్లా అధ్యక్షులు కె.మధు, ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బహుజన భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం నాయకులు టి.రాజు, సురేందర్ యాదవ్, బిఎల్ టియు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గంగ శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు జి.యాదయ్య,నాయకులు కె.సతీస్ తదితరులు పాల్గొన్నారు.