బిల్డర్లు సహకరించాలి

బిల్డర్లు సహకరించాలి– రెరా చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్‌ ఎస్టేట్‌ రంగ అభివృద్ధి, క్రమబద్ధీకరణ, కొనుగోలుదారుల నమ్మకం కోసం నిర్దేశించిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం అమలుకు బిల్డర్లు సహకరించాలని ఆ సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రతినిధులు, బిల్డర్లతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రెరా’ మరింత బలోపేతానికి నారెడ్కో, క్రెడారు వంటి సంస్థలు మరింత చొరవ చూపి, ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం అమలు వల్ల రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనేక మార్పులు సంభవించాయనీ, అనుమతి లేకుండా ప్రకటనలు జారీ చేయడం, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 48 గంటల్లోనే ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ను అన్‌లైన్‌లో జారీ చేస్తున్నామన్నారు. బిల్డర్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఏడు రోజుల్లోనే పూర్తి చేస్తున్నామని వివరించారు. బిల్డర్లు, ప్రమోటర్లు మౌలిక సౌకర్యాలతో కూడిన నిర్మాణాలకు ప్రాధ్యాన్యత ఇవ్వాలని సూచించారు.
రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రజల జీవితాలతో ప్రత్యక్షంగా మమేకమై ఉంటుందనే విషయాన్ని విస్మరించొద్దని అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి, ఉపాది కల్పనలో ఈ్‌ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) అధ్యక్షులు సునీల్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ ‘రెరా’ చట్టం అమలుతో ప్రీలాంచ్‌ వెంచర్లు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సీఐఐ) తెలంగాణ శాఖ చైర్మెన్‌ సీ శేఖర్‌రెడ్డి, కన్వీనర్‌ గౌతంరెడ్డి, క్రెడారు ప్రెసిడెంట్‌ వీ రాజశేఖర్‌ రెడ్డి, సురభిత్యాగి, నరెడ్కో జనరల్‌ సెక్రటరీ విజయసాయి, రెరా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.