ఆధునిక భారతదేశ నిర్మాణం: డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ ఆర్థిక విధానాలు

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆధునిక ప్రపంచంలో మన భారతదేశ దిశను మార్చడానికి, దేశంలోని ప్రజల ఉన్నతి కోసం,మానత్వ ఉద్ధరణ కోసం,నవ భారత నిర్మాణం కోసం మానవ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల వనరులు గల సంపన్న దేశంలో  చాతుర్వర్ణ వ్యవస్థలో అణిచివేత విలయతాండవం చెందుతున్న సమయంలో ఏప్రిల్ 14,1891 లో మధ్యభారతం లోని “మౌ” పట్టణంలో పుట్టిన వైతాళికుడు, ఆధునిక భారత దేశ పితామహుడు, డాక్టర్.భీంరావు రాంజీ అంబేద్కర్ గారు. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది అదేమిటంటే మహోన్నత్వం ఎప్పుడూ దురభిప్రాయాలకి బలవుతూనే ఉంటుంది. ఈమాట మహోన్నత మైన వ్యక్తులందరికీ వర్తిస్తుందో లేదో చెప్పలేము కానీ డాక్టర్ అంబేద్కర్ కి మాత్రం ఇది వందకి వందశాతం సరిపోతుంది. డాక్టర్ భీంరావు రాంజీ  అంబేద్కర్ ని “బాబాసాహెబ్” అనే పేరుతో పిలుస్తుంటారు. ఆయన ఎన్నో అవమానాల్ని, అన్యాయాల్ని, దురాచారాల్ని ఎదుర్కోవాడమే కాకుండా వాటినుండి శక్తిని గ్రహించి దేశ బలహీనతలను నిర్మూలించి దేశాన్ని  ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక, ఉన్నతమైన,మహోన్నతమైన దేశంగా నిర్మించేందుకు ఆర్థిక,సామాజిక, రాజకీయ ప్రణాళికలను అనేక అవరోధాలను ఎదుర్కొని సమర్థవంతంగా సాధించడం జరిగింది. బాబాసాహెబ్ ముంబాయి విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తిచేసిన తర్వాత కొలంబియా యూనివర్సిటీ,లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. బార్ ఎట్ లా చేశారు. ఆర్థికశాస్త్రం, సమాజ శాస్త్రం, మానవశాస్త్రం, సైన్స్, బయాలజీ,కామర్స్ సబ్జెక్టులకి సంబంధించి ఆయన అనేక పుస్తకాలను వ్రాశార. బాబాసాహెబ్ తన చదువులో ఆర్థిక శాస్త్రానికి అత్యుధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది.
అణిచివేయబడిన కులంలో పుట్టినందుకు చదువు, అర్హతలు అన్ని ఉన్నప్పటికీ ఆయన అనేక కష్టాల పాలయ్యారు.కానీ తన జ్ఞానాన్ని దేశ ప్రజల శ్రేయస్సే కేంద్రంగా,దేశ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా,వ్యవసాయ,పారిశ్రామిక రంగలా పై దృష్టి సారించారు. డాక్టర్.అంబేద్కర్ గారి ఆర్థిక ప్రణాళిక గురించి చూసినట్లయితే  ఆయన ఉన్నత విద్య, పరిశోధనలు ఆర్థిక శాస్త్రంలోనే అమెరికా, ఇంగ్లాండ్ లలో జరిగినాయి. అప్పుడు పరిశోధనా వ్యాసాలు,పుస్తకాలురాయటమే కాక, ఇండియా కు తిరిగి వచ్చిన తరువాత కూడా ఆర్థిక అంశాలమీద ఆయన అనేక రచనలు చేసినారు.వాటి లో వ్యక్తికరించబడిన ఆయన భావాలు, ఆలోచనలనే అంబేద్కర్ ఆర్థిక విధానాలుగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ ఆర్థిక పరిశోధనలు మరియు “స్టేట్స్ అండ్ మైనారిటీస్”, “కులనిర్మూలన” మరియు “బుద్ధుడు లేక కార్ల్ మార్క్స్” మొదలైన ఆయన రచనలలోని అంబెడ్కర్ ఆర్థిక భావాలు,ఆలోచనలను  చూడవచ్చు.
ఆర్థిక పరిశోధనలు:
ఉన్నత విద్య అభ్యశించడానికి అంబేద్కర్ 1913 లో బరోడా మహారాజు ఇచ్చిన ఉపకార వేతనంతో అమెరికా వెళ్లినాడు.అక్కడి కొలంబియా యూనివర్సిటీ లో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ. చదువుతూ 1915 లో “ఏన్సీయoట్ ఇండియన్ కామర్స్”అనే వ్యాసాన్ని రాసి సమర్పించారు. అటు తర్వాత అంబేద్కర్ రాసిన “నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా-ఏ హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ” అనే పరిశోధనా వ్యాసానికి ఆయనకు కొలంబియా యూనివర్సిటీ పిహెచ్డి డిగ్రీ ప్రదానం చేసింది. దీనినే తరువాత విపులీకరించి “ఎవాల్యూషన్ ఆఫ్ ప్రొవిన్సియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా” పేరున పుస్తకంగా ప్రచురించారు. ఇందులోని బడ్జెట్ ను గురించిన అధ్యాయాలను అనేకమంది చదివేవారు. ఉన్నత విద్యను కొనసాగించాలనే కోరికతో అంబేద్కర్ కొల్హాపూర్ మొహారాజు సమకూర్చిన ఆర్థిక సాయంతో 1920 లో లండన్ వెళ్లినాడు.1921 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ లో “ప్రొవిన్సియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ యిమ్ పీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా” అనే పరిశోధన పత్రాన్ని సమర్పించి ఆర్థిక శాస్త్రంలో యం,ఎస్సీ డిగ్రీ పొందినారు.
1922-23 లో సమర్పించిన ” “ప్రాబ్లెమ్ ఆఫ్ ది రూపి”  అనే పరిశోధనా పత్రానికి  లండన్ యూనివర్సిటీ అంబేడ్కర్ కు ఆర్థిక శాస్త్రంలో డి.యస్సి డిగ్రీని ప్రధానం చేసింది.ఇందులో అంబేద్కర్ బ్రిటీష్ సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలను విమర్శిస్తూ రాశారు.లాండన్ లోని”గ్రేస్ యిన్”లో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి “బార్ ఎట్ లా” డిగ్రీ ని పొందినారు.అంబేద్కర్ తన పరిశోధనలో బ్రిటీష్ పాలకుల ఆర్థిక  విధానాలలోని లోపాలను ఎత్తి చూపినారు.వాటివల్ల ఇండియా లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, భూమిషిస్తూ అధికంగా ఉండి రైతులమీద పెనుభారాన్ని మోపుతుందని,వారిలో పేదరికాన్ని పెంచి సామాజిక అస్థిరతకు దారితీస్తుందని అన్నాడు.మొత్తం ప్రభుత్వ రాబడులతో భూమిషిస్తు ఒక్కటే యాభై శాతానికి మించి వుండి వ్యవసాయం మరియు ఇతర పరిశ్రమల అభివృద్ధిని నిరోధిస్తుందని అన్నాడు.ప్రభుత్వ పన్నుల విధానం అన్యాయంతో కూడి వుంది లోపభూయిష్టంగా ఉందన్నాడు. వాణిజ్య పన్ను వాణిజ్య అభివృద్ధికి నిరోధకంగా ఉందని,భూస్వాములు పేద కౌలుదార్ల ఆదయాలతో విలాస జీవితం గడుపుతూ ఉంటే బ్రిటిష్ అధికారులు అధిక వేతనాలు,సౌకర్యాలూ కలిగి ఉన్నారని,ప్రభుత్వం వారి నుండి ఏ పన్నునూ వసూలు చేయడంలేదని అన్నారు.ప్రభుత్వ రాబడులలో ఎనభై శాతాన్ని మిలిటరీ,పోలీసు,న్యాయ పాలన మీదనే వ్యయం చేశారని,రోడ్లు,నీటిపారుదల వంటి పబ్లిక్ వర్క్స్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అంబేద్కర్ తీవ్రంగా విమర్శించారు
చిన్న కమతాల సమస్య:
మన దేశ వ్యవసాయరంగంలో చిన్న కమతాలు అధిక సంఖ్యలో వుండి,వాటిలో ఉత్పాదకత తక్కవగా ఉండేది .ఇందుకు ముఖ్య కారణం కమతాల విభజనేనని,చిన్న కమతాలను   సమీకృతం చేసి పెద్దవిగా మార్చితే ఉత్పాదకత పెరుగుతుందని చాలామంది విశ్లేషించి వాటి సమీకరణకు వివిధ పద్దతులను సూచించారు. అంబేద్కర్ “ఇండియా లో చిన్న కమతాలు-పరిష్కారాలు 1928″అనే తన రచనలో ఈ పెద్ద కమతాల సూచనను సరియైన పరిష్కారం కాదని తిరస్కరించారు. ఉత్పత్తి  కారకాలను సరియైన పాళ్ళల్లో ఉపయోగిస్తే గరిష్ట ప్రతిఫలం,రాబడి ఉంటాయన్నారు.లాభ  సాటి కమతం లేక కుటుంబ కమతం అంటే కుటుంబానికి సరిపడేటాయాన్నిచ్చే కమతం అనే నిర్వచనం సరియైనది కాదని, పెట్టుబడులకు మించిన రాబడి వస్తే అది లాభసాటి కమతం  అవుతుందని చెప్పారు,వ్యవసాయంలో ఉత్పాదకత తక్కువ వుండటానికి అధిక శ్రమికుల వత్తిడే కారణమని,పారిశ్రామికీకరణ ద్వారా వ్యవసాయ రంగం నుండి శ్రామికులను తరలించడమే సరైన పరిష్కరమని చెప్పినారు .ఇందుకోసం “స్టేట్ సోషలిజం” అవశ్యకమని,అందులో భూమిని ప్రభుత్వ యజమాన్యాలో ఉంచి,రష్యా,చైనాలలో లాగా సమిష్టి వ్యవసాయ పద్దతిని అనుసరించాలని,వ్యవసాయానికి,పరిశ్రమ లకు కావలసిన మూలాధానాన్ని ప్రభుత్వమే సమకూర్చలని చెప్పారు, సమిష్టి వ్యవసాయంవల్ల శ్రామికులకు ఉపాధి భద్రత,కనీస ఆదాయాలు లభించి,గ్రామీణ పేదరికం, సంపద మరియు ఆదాయాల పంపిణీలో  అసమానతల సమస్య కూడా పరిష్కరించబడుతుందన్నారు. అంబేద్కర్ మన సమాజంలో సమూలమైన మార్పులను సాధించడానికి నిరంతరం ఆలోచనలు, కృషిచేసిన గొప్ప మేధావి,నవ భారత నిర్మాత,.మనదేశంలో బ్రిటిష్ వలస పాలకులు చేసిన ఆర్థిక దోపిడీని వ్యతిరేకించారు. అంబేద్కర్ మన సామాజిక ఆర్థిక వ్యవస్థ మార్పునూ, దానికి ప్రత్యామ్నాయంగా సోషలిస్టు సమ సమాజ వ్యవస్థ నిర్మాణాన్నే కోరుకున్నారు.
వ్యాసకర్త: డాక్టర్: దేవిదాస్ సక్పాల్, ఎడ్యుకేషనల్ ఆక్టివిస్ట్..