భవనం ఒకటి…ప్రారంభోత్సవాలు రెండు

– ముందు ఎమ్మెల్యే… తర్వాత జడ్పీ చైర్మన్‌
– పీహెచ్‌సీ భవన ప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన
నవతెలంగాణ-దహెగాం
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవం ఆదివారం జరుగగా ఒకే భవనాన్ని ఇద్దరు నేతలు వేర్వేరుగా రెండుసార్లు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. మండల కేంద్రంలో ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరగా సుమారు రూ.1.56 కోట్లతో నూతన భవనం నిర్మించారు. కాగా ఈ భవనాన్ని ఆదివారం మధ్యహ్నం 3లకు ఇన్‌చార్జి మంత్రి సీతక్క ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల రీత్యా మంత్రి పర్యటన మండలంలో వాయిదా పడింది. దీంతో ముందుగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో జడ్పి చైర్మన్‌ కోనేరు కృష్ణ సైతం భవనాన్ని ప్రారంభిచడంతో అసలు ఏం జరుగుతోందని స్థానికులు చర్చలు ప్రారంభించారు. సంబంధిత అధికారుల సమన్వయ లోపమా..? లేక ఇద్దరు నాయకులు వేర్వేరు పార్టీలకు చెందిన వారు కావడం వల్ల ఇలా చేశారా..? అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా వచ్చిన ఇద్దరు నాయకులు సైతం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై అధికారులకు ఎమ్మెల్యే, అధికార పార్టీ నుంచి ఒత్తిడి వస్తుందేమోనని గుబులు పట్టుకుంది. ఈ ఘటనతో అధికారులతో పాటు ప్రజల్లో తీవ్ర చర్చాలు జరిగాయి. తమ ఉనికి కోసం రెండు పార్టీలకు ప్రజాప్రతినిధులు ఇలా ఒకే భవనాన్ని రెండు సార్లు ప్రారంభించడం పట్ల జనాలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కంభగౌని సులోచన, జడ్పీటీసీ శ్రీరామరావు, ఎంపీటీసీ జయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారాం, వైద్యులు క్రాంతి, అశ్విని, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.