ప్రజాస్వామ్యానికి నోరుంటే దేశంలో మారణహోమంపై గొంతుచించుకుని అరిచేది… న్యాయానికి కండ్లుంటే జరుగుతున్న అన్యాయంపై చూపుల్ని కత్తులు చేసేది… రాజ్యాంగానికి చేతులుంటే హననమవుతున్న హక్కులకు రక్షణ కవచంలా కాపాడుకునేది… కేంద్రం విభజన రాజకీయాల గురించి ఇంతకన్నా వేరే చెప్పనక్కర్లేదు. దేశంలో ‘రాజ’ హింస పెరుగుతున్నది. మొన్న మణిపూర్, నిన్న హర్యానా, రేపు ఏ రాష్ట్రమో…? అయినా ఆయన మౌనం దేశాన్ని ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. ఈ మౌనం బుల్డోజర్‌లకు ఇంధనమవుతున్నది. ఇప్పటిదాకా కులం, మతం, అసమానతలే దేశంలో హింసను పెంచిపోషిస్తున్నాయనుకున్నాం! కానీ ఇప్పుడు బుల్డోజర్‌ది కూడా కీలకపాత్రేనని హర్యానాలో జరుగుతున్న విధ్వంసం ఎత్తి చూపుతున్నది. ప్రపంచ దేశాల్లో దేశఖ్యాతి గురించి గొప్పగా చెప్పే నాయకుడు ఇక్కడ హింసను చల్లార్చే ప్రయత్నం చేయడం లేదు. మణిపూర్‌లో మంటలు ఆరకముందే… హర్యానా లోనూ విభజన రాజకీయం బుసలు కొడుతోంది. మన రాజు మాత్రం మణిపూర్ విషయంలో ఎలాంటి మౌనపాత్రను పోషించారో ఇంకా అదేపాత్రలో లీనమై ఉన్నారు. బుల్డోజర్లు మాత్రం బ్రేకుల్లేని బండ్లలా దూసుకెళ్తున్నాయి. శాంతిని, సామరస్యతను ధ్వంసం చేస్తున్నాయి.
మణిపూర్‌లో కుకీ, మైతేయిల మధ్య సృష్టించబడిన జాతివైషమ్యం రగులుతుండగానే హర్యానాలో హిందూ, ముస్లింల మధ్య నిప్పురాజుకుంది. ఘటనకు సంబంధించిన పూర్వపరాలు తెలిసినవే. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నవి డబులింజన్ సర్కార్లే… హింస జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం లేకుండా ప్రభుత్వం నిద్ర నటిస్తున్నదని పోయిన ప్రాణాలను చూస్తే అవగతమవుతున్నది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాల్లో రెండు ప్రధానమైనవి. ఒకటి పాలనా వైఫల్యం కాగా మరొకటి బుల్డోజర్ ‘అ’న్యాయం. ఇవే ఇప్పుడు దేశాన్ని రావణకాష్టంలా మారుస్తున్నవి. ఇటీవల మతపరమైన అల్లర్లు చోటుచేసుకున్న హర్యనాలోని నుV్‌ా ప్రాంతంలో బుల్డోజర్ వెళ్లి అనీష్ అనే వ్యక్తి ఇల్లు కూల్చింది. కారణం ఆయన ముస్లిం కాబట్టి! అయితే అంతకుముందు ఉద్రిక్తతల సమయంలో ముగ్గురు హిందువులకు మూక గుంపు ఎదురుకావడంతో వారు ప్రాణభయంతో పరుగెత్తుతూ అనీష్ ఇంటి వద్ద ఆగడంతో, ఆయన వారిని లోపలికి తీసుకెళ్లి తిండిపెట్టి ఆశ్రయం కల్పించారు. భయం వద్దని చెప్పి సాయంత్రం తన కారులో తీసుకెళ్లి సురక్షితమైన చోట వదిలిపెట్టి వచ్చాడు. ఇది జరిగిన వారం రోజులకు అనీష్ ఇంటిని బుల్డోజర్ కూల్చేసింది. బాధితుడు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. పైగా ఇది అక్రమ కట్టడమని వాదించింది. గురుగ్రామ్ నగరంలోనూ ఇరవై ఏండ్లుగా ఉన్న మెడికల్ షాపుల్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసే ప్రయత్నాలు చేయగా సుమోటోగా తీసుకున్న అక్కడి హైకోర్టు కూల్చివేతలను ఆపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరి అనీష్ ఇల్లును ఎందుకు కూల్చినట్టు? ఎందుకంటే ఆయన అల్లరిమూకల నుంచి వారిని రక్షించినందుకు…
ఈ బుల్డోజర్ వ్యవస్థకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదట శ్రీకారం చుట్టారు. క్రమంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాం ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. రాష్ట్రం ఏదైనా, కారణాలు ఏమైనా ఈ బుల్డోజర్లన్నీ ఒక మతానికి సంబంధించిన వారినే టార్గెట్ చేస్తుండటం గమనార్హం! పలువురు ఈ కూల్చివేతలపై హైకోర్టు, సుప్రీంకోర్టులను సైతం ఆశ్రయించగా ‘కూల్చివేతలనేవి చట్టానికి లోబడి ఉండాలి…అవి ప్రతీకారం తీర్చుకునేలా ఉండకూడదు’ అని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించింది. అయినా ఈ బుల్డోజర్లు ఆగడం లేదు. అనీష్‌లాంటి వ్యక్తుల ఇండ్లను కూల్చివేస్తూనే ఉన్నాయి.
అక్రమ కట్టడాలనేవి ఉద్రిక్తతల సమయంలోనే ఎందుకు గుర్తొస్తున్నాయనేది ఇక్కడ ప్రశ్న. వాటికి పాలకుల దగ్గర జవాబు లేదు. అస్సాంలో విచారణ ముసుగులో ఐదుగురు నిందితుల ఇండ్లపైకి బుల్డోజర్ నడిపించినందుకు గౌహాతి కోర్టు అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌ను మందలించింది. అయినా వారికి పట్టింపు లేదు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే కదా! ఈ కూల్చివేతలకు అక్రమ నిర్మాణాలని ముద్రవేస్తున్న ప్రభుత్వాలు… కోర్టులకు సైతం ఆక్రమణ లేనని తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయి. మళ్లీ జనాల్లోకి వచ్చి చేసిన తప్పులకే శిక్ష అంటూ ప్రచారం చేస్తున్నాయి. మరి ఇంత నిరంకుశంగా శిక్షలు అమలు చేస్తుంటే కోర్టులు, పోలీసుస్టేషన్లు ఎందుకున్నట్టు? యోగి ప్రారంభించిన ఈ ‘బుల్డోజర్ న్యాయవ్యవస్థ’ను ఇటీవల శివరాజ్‌సింగ్‌చౌహన్ కూడా తన భుజాన వేసుకున్నాడు. తాజాగా కట్టర్ ఖాతాలో కూడా చేరిపోయింది. మరి అడ్డుకట్టవేసేదెవరు? ప్రజలే ఆలోచించాలి.