రైతులపై బుల్లెట్లు, టియర్‌ గ్యాస్‌ షెల్స్‌

Bullets tear gas shells on farmers– యువ రైతు మృతి.. 25 మందికి తీవ్ర గాయాలు
– హర్యానా-పంజాబ్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం
– జేసీబీ, ప్రొక్లెయినర్స్‌ యజమానులకు బెదిరింపులు
– ఐదో దఫా చర్చలకు కేంద్రం పిలుపు 
– రైతులపై పోలీసు చర్యలను ఖండించిన ఏఐకేఎస్‌, ఎస్‌కేఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కావాలని డిమాండ్‌ చేస్తూ ‘చలో ఢిల్లీ’ చేపట్టిన అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వం టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, రబ్బర్‌ బుల్లెట్ల వర్షం కురిపించింది. రైతులపై పోలీసులు జరిపిన ఈ దాడిలో బుల్లెట్‌ గాయాలతో భట్టిండా జిల్లా బల్లో గ్రామానికి చెందిన యువ రైతు శుభకరన్‌ సింగ్‌ (23) మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ నెల 18న కేంద్ర మంత్రులు – రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు తిరిగి ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హర్యానా-పంజాబ్‌ సరిహద్దులు శంభు, ఖానౌరీ నుంచి ఢిల్లీ వైపు రైతులు కదంతొక్కారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు, భద్రత దళాలు ఏర్పాటుచేసిన బారికేడ్లను, ఇనుప చువ్వలను, కాంక్రీటు గోడలను తొలగించేందుకు రైతులు హైడ్రాలిక్‌ క్రేన్‌లు, జేసీబీలు, ప్రొక్లెయినర్స్‌ తదితర భారీ యంత్రాలను ఉపయోగించి ముందుకుసాగారు. దీంతో రైతులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. ఈ దాడిలో ఒక యువ రైతు మరణించగా, 25 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు క్రిపాల్‌ సింగ్‌ తెలిపారు. పోలీసులు పలువురు రైతులను అరెస్టు చేసి హర్యానాకు తరలించారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పలువురు రైతులు పొలాల గుండా సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. యువ రైతు మరణానికి ఏఐకేఎస్‌ సంతాపం తెలిపింది. పోలీసులు చర్యలను ఖండించింది. అలాగే సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) కూడా పోలీసుల చర్యలను ఖండించింది.
చర్చలకు పిలుపు
ఇదిలావుండగా.. కేంద్ర ప్రభుత్వం రైతులను ఐదో విడత చర్చలకు ఆహ్వానించింది. రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామనీ, వారిని చర్చలకు ఆహ్వానిస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా అన్నారు. కనీస మద్దతు ధర, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్ధమని అన్నారు. గత ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఎత్తివేసే అంశంపై చర్చిస్తామని తెలిపారు.
దేశంలో శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యమన్నారు. కాగా, తమ డిమాండ్‌లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రైతులు అంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
జేసీబీ, ప్రొక్లెయినర్స్‌ యజమానులకు బెదిరింపులు
రైతులకు అద్దెకిచ్చిన జేసీబీ, ప్రొక్లెయినర్స్‌ యజమానులపై హర్యానా పోలీసులు బెదిరింపులకు దిగారు. రైతుల వద్ద నుంచి జేసీబీ, ప్రొక్లెయినర్స్‌ వెనక్కి తీసుకోవాలనీ, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆందోళన ప్రదేశాల నుంచి తమ జేసీబీలు, ప్రొక్లెయినర్స్‌, బుల్డో జర్లు ఖాళీ చేయించకపోతే సీజ్‌ చేస్తామని తెలిపారు.
ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాల్సిందే : రైతులు
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పిస్తే రైతులు ఆందోళన విరమిస్తారని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ ప్రధాన కార్యదర్శి శర్వన్‌ సింగ్‌ పాంథర్‌ బుధవారం పునరుద్ఘాటించారు. రైతులందరూ ఢిల్లీ ఛలో ప్రదర్శనలో ముందుకుసాగరని, కేవలం రైతు నాయకులే దేశ రాజధానికి ప్రదర్శనగా తరలివస్తారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీపై చట్టం తీసుకువస్తే ఈ ఆందోళన అంతా సమసిపోతుందని తేల్చిచెప్పారు. రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని దేశ యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై చర్చలు జరపాలని, రైతుల ఛలో ఢిల్లీ ప్రదర్శన శాంతియుతంగా సాగేందుకు అనుమతించాలని అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో తాము అన్ని సమావేశాలకు హాజరై తమ డిమాండ్లు సహా అన్ని అంశాలు ప్రభుత్వం ముందుంచామన్నారు. ప్రధాని చొరవచూపి తమ డిమాండ్లు అంగీకరించాలని కోరారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్డీయే ఎంపీలకు వ్యతిరేకంగా ఎస్‌కేఎం ఆందోళన
2020లో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ-ఎన్డీయే ఎంపీలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌, హర్యానా, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రైతులు పెద్దఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ ఎంపీల కార్యాలయాలు, నివాసాల ఎదుట ఆందోళనలు జరిగాయి. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
పంటలకు చట్టపరమైన మద్దతు ధర డిమాండ్‌పై రైతుల ఆందోళన తీవ్రతరమవుతున్న నేపథ్యంలో గురువారం ఢిల్లీలో జరగనున్న సంయుక్త కిసాన్‌ మోర్చా సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అఖిల భారత ప్రాతిపదికన, సమస్యల ప్రాతిపదికన అన్ని రైతు సంఘాలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఎస్‌కేఎం ప్రకటించింది. హర్యానా-పంజాబ్‌ సరిహద్దుల్లో రైతులపై పోలీసుల దాడి, కనౌరిలో యువ రైతు హత్యపై ఎస్‌కేఎం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పోలీసు చర్యలను ఖండించింది.