– ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్
దుబాయ్: భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో గత 40 ఏండ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బుమ్రా.. బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల ప్రదర్శనకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ప్రపంచ అగ్ర బౌలర్‌గా నిలువటం బుమ్రాకు ఇది కొత్త కాదు. కానీ, ఈ సారి అగ్రస్థానానికి మరో ప్రత్యేకత సైతం ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత పేసర్‌గా జశ్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. 904 రేటింగ్ పాయింట్లతో బుమ్రా నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతంలో భారత్ నుంచి స్పిన్నర్ అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అశ్విన్ రికార్డును తాజాగా బుమ్రా సమం చేశాడు. మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగితే రేటింగ్‌లో సరికొత్త రికార్డు నమోదవటం లాంఛనమే. గత వారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ 789 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్, హ్యారీ బ్రూక్, కేన్ విలియమ్సన్, ట్రావిశ్ హెడ్‌లు టాప్-4లో ఉండగా.. యశస్వి జైస్వాల్ ఐదో స్థానంలో నిలిచాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (124), భారత్ (111) టాప్-2లో కొనసాగుతున్నాయి.