దుబాయ్: భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. 2024 ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ఐసీసీ సోమవారం వెల్లడించింది. జో రూట్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) సహా జశ్‌ప్రీత్ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. అవార్డు రేసులో ముగ్గురు బ్యాటర్లతో పేసర్ బుమ్రా పోటీపడుతున్నాడు. ఈ ఏడాది 13 టెస్టుల్లో 14.92 సగటుతో బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సైతం బుమ్రా నామినేట్ అయ్యాడు. జో రూట్, ట్రావిశ్ హెడ్, హ్యారీ బ్రూక్‌లతో బుమ్రా ఇక్కడ పోటీపడుతున్నాడు. భారత్ నుంచి ఇతర క్రికెటర్లు ఎవరూ ఐసీసీ అవార్డుకు నామినేట్ అవ్వలేదు. ఐసీసీ అవార్డు జ్యూరీ, అభిమానుల ఓటింగ్‌తో అవార్డు విజేతలను నిర్ణయిస్తారు.