– ధర్మశాల టెస్టుకు భారత పేస్ దళపతి
– గాయంతో కెఎల్ రాహుల్ దూరం
ముంబయి : భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ఆటగాళ్ల అందుబాటుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక సమాచారం అందించింది. పని భారంతో రాంచి టెస్టుకు విశ్రాంతి తీసుకున్న పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా.. మార్చి 7 నుంచి ఆరంభం కానున్న ధర్మశాల టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఐదో టెస్టు ముంగిట జశ్‌ప్రీత్ బుమ్రా భారత జట్టుతో చేరుతాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక హైదరాబాద్ టెస్టులో గాయపడిన కెఎల్ రాహుల్.. వరుసగా మరో టెస్టుకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో కెఎల్ రాహుల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినా.. ఫిటెనెస్ క్లియరెన్స్ లేకపోవటంతో రాహుల్ అందుబాటులో ఉండటం లేదు. గాయం, ఫిట్‌నెస్ కారణంగా ఐదో టెస్టుకు సైతం రాహుల్ దూరంగా ఉంటున్నాడని తెలిపింది. కెఎల్ రాహుల్ గాయంపై తదుపరి చర్యల్లో భాగంగా లండన్‌లోని వైద్య నిపుణులను సంప్రదించనున్నారు. ఇక వైజాగ్ టెస్టు నుంచి రోహిత్‌సేనతో కొనసాగుతున్న యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్..రంజీ సెమీఫైనల్లో తమిళనాడు తరఫున ఆడేందుకు జట్టు నుంచి బయటకు రానున్నాడు. అవసరమైతే ఐదో టెస్టు ముంగిట వాషింగ్టన్ సుందర్‌ను వెనక్కి పిలిపిస్తామని బోర్డు తన ప్రకటనలో తెలిపింది. ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమికి లండన్‌లో శస్త్రచికిత్స విజయవంతమైందని, రిహాబిలిటేషన్ కోసం త్వరలోనే బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకుంటాడని వెల్లడించింది.