బౌలింగ్‌లో బుమ్రాకు అగ్రస్థానం

Bumrah is top in bowling– జైస్వాల్‌, కోహ్లీ ర్యాంకులు పతనం
– ఐసీసీి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీి) ప్రకటించిన తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ బుధవారం వెల్లడించిన టెస్ట్‌ బౌలర్ల జాబితాలో బుమ్రా 883 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక టాప్‌-10 బౌలర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌(807) 4వ, రవీంద్ర జడేజా(794) 6వ స్థానంలో నిలిచారు. ఇక కుల్దీప్‌ యాదవ్‌(648) 19వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టిన యశస్వీ జైస్వాల్‌తో పాటు విరాట్‌ కోహ్లీ ర్యాంకులు పతనమయ్యాయి. జైస్వాల్‌ రెండు ర్యాంక్‌లు పడిపోయి నాల్గో స్థానానికి చేరగా.. విరాట్‌ కోహ్లీ(689) 14వ స్థానానికి పడిపోయాడు. టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌(736) 6వ స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. శుభ్‌మన్‌ గిల్‌ టెస్టు బ్యాటర్ల జాబితాలో 18వ స్థానంలో ఉన్నాడు. అతడు ఖాతాలో 673పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌(895పాయింట్లు) మరోసారి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. బ్రూక్‌(ఇంగ్లండ్‌) 854రేటింగ్‌ పాయింట్లతో 2వ స్థానంలో, కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌) 830రేటింగ్‌ పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉఉండగా.. పెర్త్‌ వేదికగా జరిగిన తొలిటెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక విరాట్‌ కోహ్లీ పెర్త్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పెర్త్‌ టెస్టులో రిషబ్‌ పంత్‌ బ్యాట్‌ రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే, ర్యాంకింగ్‌లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. టెస్ట్‌ బ్యాటర్ల టాప్‌-10లో కేవలం పంత్‌, జైస్వాల్‌ మాత్రమే ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలిటెస్ట్‌లో బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్‌కు అశ్విన్‌కు విశ్రాంతినిచ్చినా అతడు నాలుగో స్థానంలో కొనసాగుతుండగా..
స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరుచుకొన్నాడు. ఇక టెస్టుల్లో భారత్‌ 111పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది.